Nayanthara: చిరంజీవి సినిమా ప్రమోషన్స్‌పై ట్రోల్స్: ఘాటుగా స్పందించిన నయనతార

- చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమా ప్రమోషన్లలో నయనతార
- సాధారణంగా ప్రచారానికి దూరంగా ఉండే నయన్
- షూటింగ్ కి ముందే ప్రమోషన్స్ చేయడంపై తమిళ నెటిజన్ల ట్రోలింగ్
- "ప్రమోషన్ నా వ్యక్తిగత విషయం" అంటూ ట్రోల్స్‌కు నయన్ కౌంటర్
- గతంలో చిరంజీవితో రెండు సినిమాలు చేసిన నయనతార
స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ, తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ చిత్రాలు చేస్తూ కెరీర్‌లో దూసుకుపోతున్నారు. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరు హీరోలతోనూ నటిస్తున్నారు. తాజాగా, మెగాస్టార్ చిరంజీవి సరసన, దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రంలో నటించనున్నారు.
సాధారణంగా తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉండే నయనతార, ఈ చిత్రానికి మాత్రం షూటింగ్ ప్రారంభానికి ముందే ప్రచారం మొదలుపెట్టడం చర్చనీయాంశమైంది. ఇటీవల దర్శకుడు అనిల్ రావిపూడి చెన్నై వెళ్లి ఆమెతో ఒక ప్రమోషన్ వీడియో చిత్రీకరించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, తమిళ సినిమా ప్రమోషన్లలో పెద్దగా కనిపించని నయనతార, తెలుగు సినిమా కోసం ఇంత ముందుగా ప్రచారం చేయడంపై కొందరు తమిళ నెటిజన్లు ట్రోల్స్ ప్రారంభించారు. "తెలుగు సినిమాలపై అంత ఇష్టమా? అయితే టాలీవుడ్‌కే షిఫ్ట్ అవ్వొచ్చు కదా?" అంటూ విమర్శలు గుప్పించారు.
ఈ ట్రోల్స్‌పై నయనతార తనదైన శైలిలో స్పందించారు. "అనవసర విషయాలకు సమయం వృథా చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. నా వీలును బట్టి నిర్మాతలకు సహకరిస్తూనే ఉంటాను. ప్రమోషన్లకు వెళ్లాలా, వద్దా అన్నది కూడా నా వ్యక్తిగత విషయం. ఈ విషయంలో ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు" అని ఆమె ఘాటుగా బదులిచ్చారు. కాగా, గతంలో చిరంజీవితో నయనతార రెండు చిత్రాల్లో నటించగా, ఇప్పుడు మూడోసారి మెగాస్టార్ సరసన నటిస్తోంది.