Ustaad Bhagat Singh: పవన్ 'ఉస్తాద్ భగత్ సింగ్'పై క్రేజీ అప్‌డేట్.. సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడో చెప్పిన హరీశ్ శంకర్

- జూన్ రెండో వారం నుంచి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ పునఃప్రారంభం
- ఇవాళ తిరుమలలో వెల్లడించిన దర్శకుడు హరీశ్ శంకర్
- సుమారు నెల రోజుల పాటు కీలక సన్నివేశాల చిత్రీకరణ
- 2026లో సినిమా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై దర్శకుడు హరీశ్ శంకర్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆయన మంగళవారం ఉదయం వీఐపీ విరామం సమయంలో దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం ఆలయం వెలుపల మీడియాతో హరీశ్ శంకర్ మాట్లాడారు. జూన్ రెండవ వారంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలియజేశారు. సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చామని ఆయన తెలియజేయడంతో పవన్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు.
గతంలో పవన్ కల్యాణ్‌తో ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన హరీశ్, ఈ సినిమాతో మరోసారి ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. తాజా షెడ్యూల్ సుమారు నెల రోజుల పాటు కొనసాగుతుందని సమాచారం. ఈ షెడ్యూల్‌లో పవన్ కల్యాణ్, శ్రీలీలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. నిర్మాణ వర్గాల సమాచారం ప్రకారం షెడ్యూల్ ప్రారంభమైన ఒకట్రెండు రోజుల్లో పవన్ షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది.
కొంతకాలంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే, హనుమాన్ జయంతి సందర్భంగా చిత్ర బృందం ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఆ పోస్టర్‌లో పవన్ హనుమంతుడి లాకెట్ ధరించి, దర్శకుడు హరీశ్ శంకర్ చేతిని పట్టుకుని ఉన్న దృశ్యం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పోస్టర్‌తో సినిమా ఆగిపోలేదని, త్వరలోనే చిత్రీకరణ మొదలవుతుందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తొలుత ఈ సినిమాను 2025 దీపావళికి విడుదల చేయాలని భావించినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం 2026లో థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, పవన్ ప్రస్తుతం ముంబైలో ‘ఓజీ’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను మేకర్స్ కూడా ప్రకటించారు. సెప్టెంబర్ 25న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇటీవలే పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఇక, పవర్‌స్టార్ నటించిన మరో భారీ చిత్రం ‘హరిహర వీరమల్లు-పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.