Karachi Jail Break: పాకిస్థాన్ జైలు నుంచి 200 మంది ఖైదీలు పరారీ... హై టెన్షన్

Karachi Jail Break 200 Inmates Escape Pakistan Prison
  • కరాచీ మాలిర్ జైలులో సోమవారం అర్ధరాత్రి దాటాక తీవ్ర ఘర్షణ
  • దాదాపు 200 మంది కరుడుగట్టిన ఖైదీలు జైలు నుంచి పరారీ
  • జైలు గేట్లు బద్దలుకొట్టి, పోలీసులతో ఖైదీల భీకర ఘర్షణ
పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో తీవ్ర కలకలం రేగింది. కరడుగట్టిన నేరస్తులకు నిలయమైన మాలిర్ జైలు నుంచి పెద్ద సంఖ్యలో ఖైదీలు తప్పించుకున్నారు. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత జైలు లోపల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఖైదీలు భద్రతా సిబ్బందితో తీవ్రంగా ఘర్షణపడి, జైలు ప్రధాన ద్వారాలను బద్దలుకొట్టి పారిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో కరాచీ వ్యాప్తంగా భయాందోళనలు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, దాదాపు 200 మంది ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. జైలులో ఖైదీలు ఒక్కసారిగా పోలీసు అధికారులపై దాడికి దిగి, వారిని గాయపరిచి ఈ దారుణానికి ఒడిగట్టారని సమాచారం. ఈ క్రమంలో జైలు ప్రాంగణంలో పెద్ద ఎత్తున కాల్పులు కూడా జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడిన ఒక పోలీసు అధికారి పరిస్థితి విషమంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు, తప్పించుకున్న ఖైదీల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు సుమారు 20 మంది ఖైదీలను తిరిగి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మిగిలిన వారి కోసం వేట కొనసాగుతోంది.

జైలు డీఐజీ హసన్ సెహ్టో మీడియాతో మాట్లాడుతూ, "జైలు మొత్తాన్ని సీల్ చేశాం. ఈ ఘటనలో కొంతమంది ఖైదీలు, పోలీసులు గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం" అని తెలిపారు. పాకిస్థాన్ రేంజర్లు, పోలీసులు, ఎఫ్‌సీ (ఫ్రాంటియర్ కార్ప్స్) సిబ్బంది పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.

భద్రతా కారణాల దృష్ట్యా, జైలుకు సమీపంలో ఉన్న జాతీయ రహదారిని రెండు వైపులా తాత్కాలికంగా మూసివేశారు. సాధారణ ప్రజలు జైలు పరిసర ప్రాంతాలకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాగా, జైలు గోడ ఒకటి స్వల్ప భూకంపం కారణంగా కూలిపోయిందని, దాంతో ఖైదీలు పారిపోయారని కూడా కొన్ని నివేదికలు వెలువడుతున్నాయి. అయితే, ఖైదీలు హింసాత్మకంగా గేట్లు బద్దలు కొట్టి పారిపోయారనేదే ప్రధానంగా వినిపిస్తున్న వాదన. ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించినట్లు సమాచారం.
Karachi Jail Break
Pakistan
Karachi
Prison Escape
Malir Jail
Inmates Flee
Jail Riot
Prison Breakout
Crime News
Hasan Sehto

More Telugu News