Himanta Biswa Sarma: బ్రహ్మపుత్ర నీళ్లను చైనా ఆపేస్తే ఏంచేస్తారు?.. పాక్ దుష్ప్రచారం

Himanta Biswa Sarma counters Pakistans Brahmaputra water claims
  • అదే జరిగితే అస్సాంలో వరదలు తగ్గుతాయేమోనని హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్య
  • బ్రహ్మపుత్ర నదిలో చైనా వాటా 30-35 శాతమేనని వెల్లడి
  • సింధు జలాల ఒప్పందం రద్దుతో పాక్ ఆందోళన చెందుతోందని విమర్శ
సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన భారత ప్రభుత్వం పాకిస్థాన్ కు నీళ్లు ఆపేసిన విషయం తెలిసిందే. దీంతో పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ ఎండిపోతోంది. రెండు కీలక డ్యామ్ లలో నీటిమట్టం కనీస స్థాయికి దిగువకు చేరింది. భారత్ సింధూ నది జలాలను వదలకపోతే ఈసారి సాగు కష్టమేనని అక్కడి రైతులతో పాటు పాక్ ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలోనే బ్రహ్మపుత్ర నదీ జలాలపై తప్పుడు ప్రచారానికి తెరలేపింది. చైనా కూడా బ్రహ్మపుత్ర నది జలాలను ఆపేస్తే ఏంచేస్తారంటూ భారత్ ను ప్రశ్నిస్తోంది. తమలాగే భారత్ కూడా ఇబ్బంది పడాల్సివస్తుందని బెదిరింపులకు దిగుతోంది. అయితే, పాక్ చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తిప్పికొట్టారు.

ఈ అంశంపై ఎక్స్ (X) వేదికగా హిమంత బిశ్వ శర్మ ఘాటుగా స్పందించారు. "ఈ కట్టుకథను భయంతో కాకుండా, వాస్తవాలు, జాతీయ స్పష్టతతో ఛేదిద్దాం," అని ఆయన పేర్కొన్నారు. బ్రహ్మపుత్ర నది భారత్‌లో ప్రవహిస్తూ విస్తరిస్తుందే తప్ప, ఎగువ ప్రాంత నియంత్రణ వల్ల కుంచించుకుపోయే నది కాదని ఆయన వివరించారు. నది మొత్తం ప్రవాహంలో చైనా వాటా కేవలం 30 నుంచి 35 శాతం మాత్రమేనని, అది కూడా టిబెట్ పీఠభూమిలోని హిమానీనదాలు కరగడం, పరిమిత వర్షపాతం వల్లే వస్తుందని తెలిపారు. మిగిలిన 65 నుంచి 70 శాతం నీరు ఈశాన్య భారతంలో కురిసే రుతుపవన వర్షాలు, ఉపనదుల ద్వారానే బ్రహ్మపుత్రలో చేరుతుందని ఆయన గణాంకాలతో సహా వివరించారు.

జలసంబంధ గణాంకాలను ఉటంకిస్తూ, చైనా-భారత్ సరిహద్దు వద్ద (ట్యూటింగ్) నది ప్రవాహం సెకనుకు సగటున 2,000 నుంచి 3,000 క్యూబిక్ మీటర్లు ఉండగా, రుతుపవనాల సమయంలో అస్సాంలోకి వచ్చేసరికి ఇది సెకనుకు 15,000 నుంచి 20,000 క్యూబిక్ మీటర్లకు పెరుగుతుందని శర్మ తెలిపారు. ఇది నది ఉద్ధృతిలో భారత్ పాత్ర అధికంగా ఉందని నిరూపిస్తోందన్నారు. "బ్రహ్మపుత్ర నది కోసం భారత్ ఎగువ ప్రాంతాలపై ఆధారపడటం లేదు. ఇది వర్షాధార భారతీయ నదీ వ్యవస్థ, భారత భూభాగంలోకి ప్రవేశించాక మరింత బలపడుతుంది" అని ఆయన స్పష్టం చేశారు.

ఒకవేళ చైనా నీటి ప్రవాహాన్ని తగ్గించినా, అది భారత్‌కు మేలు చేస్తుందేమోనని, ఏటా లక్షలాది మందిని నిరాశ్రయులను చేస్తున్న అస్సాం వరదలు తగ్గుముఖం పట్టవచ్చని శర్మ అభిప్రాయపడ్డారు. బ్రహ్మపుత్రను ఆయుధంగా వాడుకుంటామని చైనా అధికారికంగా ఎన్నడూ బెదిరించలేదని, ఈ ప్రచారమంతా కేవలం ఊహాజనిత భయాలను వ్యాప్తి చేయడమేనని కొట్టిపారేశారు. సింధు జలాల ఒప్పందం ద్వారా సుదీర్ఘకాలం లబ్ధి పొందిన పాకిస్థాన్, ఇప్పుడు భారత్ తన నీటి సార్వభౌమాధికారాన్ని తిరిగి పొందుతుండటంతో 'ఆందోళన చెందుతోందని' ఆయన విమర్శించారు.
Himanta Biswa Sarma
Brahmaputra River
China
Pakistan
Indus Waters Treaty
Assam Floods
Water Dispute
River Water Sharing
India China Relations
Water Resources

More Telugu News