Mount Etna: ఇటలీలో అగ్నిపర్వతం విస్ఫోటనం.. భయంతో పరుగులు తీసిన పర్యాటకులు (ఇదిగో వీడియో)

- సిసిలీలో మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం బద్దలు
- వాతావరణంలోకి పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న బూడిద
- పర్యాటకులు, స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు
- ప్రజలు మాస్కులు ధరించాలని ప్రభుత్వం సూచన
ఇటలీలోని సిసిలీ ద్వీపం తూర్పు తీరంలో ఉన్న ప్రఖ్యాత మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం సోమవారం ఒక్కసారిగా బద్దలైంది. ఈ హఠాత్ పరిణామంతో భారీ స్థాయిలో బూడిద ఆకాశంలోకి ఎగసిపడింది. అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో సమీప ప్రాంతాల్లోని పర్యాటకులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు.
విషయం తెలియగానే అప్రమత్తమైన స్థానిక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పర్యాటకులతో పాటు, అగ్నిపర్వతం సమీపంలోని గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు. అగ్నిపర్వతం నుంచి ప్రమాదకరమైన వాయువులు వెలువడుతున్నాయని, ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచనలు జారీ చేశారు.
మౌంట్ ఎట్నా ప్రపంచంలోని అత్యంత క్రియాశీలక అగ్నిపర్వతాలలో ఒకటిగా గుర్తింపు పొందిందని ఇటలీకి చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియోఫిజిక్స్ అండ్ వోల్కనాలజీ సంస్థ తెలిపింది. గత ఐదేళ్లుగా ఈ అగ్నిపర్వతం నిరంతరం అగ్నికీలలు విరజిమ్ముతున్నట్టు ఆ సంస్థ పేర్కొంది. కొన్ని గంటల నుంచి అగ్నిపర్వతం నుంచి బూడిద వెలువడుతూనే ఉందని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరిన్ని విస్ఫోటనాలు సంభవించే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.