Revanth Reddy: ప్రజల ఆకాంక్షలే మా అజెండా.. వ్యవస్థల ప్రక్షాళనే ధ్యేయం: సీఎం రేవంత్ రెడ్డి

- రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం రేవంత్
- పదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన వ్యవస్థలను చక్కదిద్దుతున్నామన్న ముఖ్యమంత్రి
- మహిళలకు క్యూఆర్ కోడ్‌తో ఉచిత వైద్య పరీక్షల పథకం ప్రకటన
- కోటి మందిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యమన్న రేవంత్
రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రధాన అజెండా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తాము అధికార పగ్గాలు చేపట్టే సమయానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర గందరగోళంలో ఉందని, గత పదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన అనేక కీలక వ్యవస్థలను ప్రస్తుతం చక్కదిద్దే పనిలో నిమగ్నమయ్యామని తెలిపారు. ఈరోజు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
మహిళా సాధికారతకు ప్రత్యేక చర్యలు
తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు మహిళలే మూలస్తంభాలని సీఎం అన్నారు. "కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం. వారికి ఇప్పటికే రూ.21 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలను అందించాం. పాఠశాలల నిర్వహణ బాధ్యతలను కూడా మహిళా సంఘాలకే అప్పగించాం. రుణాలు ఇచ్చి బస్సులు కొనుగోలు చేయించి, వాటిని ఆర్టీసీకి అద్దెకు తీసుకుని మహిళా సంఘాలకు ఆదాయం కల్పిస్తున్నాం. త్వరలోనే క్యూఆర్ కోడ్ కార్డు ద్వారా మహిళలకు ఉచితంగా వైద్యపరీక్షలు చేయించే పథకాన్ని కూడా తీసుకురాబోతున్నాం" అని రేవంత్ రెడ్డి వివరించారు.
రైతు సంక్షేమానికి అగ్ర తాంబూలం
రైతుల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రజా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని ముఖ్యమంత్రి తెలిపారు. "మేం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోపే రూ. 2 లక్షల లోపు రైతుల రుణాలను మాఫీ చేశాం. ఈ పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.26 వేల కోట్లు జమ చేశాం. సన్నవడ్లు పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నాం. దీని ఫలితంగా రాష్ట్రంలో సన్న వడ్ల సాగు గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.2.75 లక్షల టన్నుల సన్న ధాన్యం ఉత్పత్తి అవుతోంది. రైతుల భూములపై ఎలాంటి వివాదాలు లేకుండా చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. అందుకోసమే 'భూభారతి' కార్యక్రమాన్ని తీసుకువస్తున్నాం" అని ఆయన పేర్కొన్నారు.
యువత, విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి
ఉద్యోగ నియామకాల విషయంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని సీఎం అన్నారు. నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేరుస్తూ వారి విశ్వాసాన్ని చూరగొన్నామని చెప్పారు. సివిల్స్‌కు ఎంపికైన వారికి ప్రోత్సాహకంగా రూ.లక్ష అందిస్తున్నామని, విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. "ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. ఇందుకోసం రూ.200 కోట్లతో భవన నిర్మాణ పనులు చేపట్టాం. గురుకుల విద్యార్థులంతా ఒకే ప్రాంగణంలో ఉండాలన్నది మా ప్రభుత్వ ఉద్దేశం" అని రేవంత్ రెడ్డి అన్నారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్య, వైద్య రంగాలను ప్రక్షాళన చేసిందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచామని, ఉస్మానియా ఆసుపత్రికి పూర్వవైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.10 లక్షలకు పెంచినట్టు తెలిపారు. "వందేళ్లలో జరగని కులగణనను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ఈ విప్లవాత్మక నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వంలోనూ కదలిక వచ్చింది. రాబోయే జనగణనలో కులగణన అంశాన్ని కూడా చేర్చుతామని కేంద్రం ప్రకటించింది" అని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.