Shreyas Iyer: శ్రేయస్ ను మెచ్చుకున్న పాండ్య

- అయ్యర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడన్న ముంబై ఇండియన్స్ సారథి
- మంచి స్కోర్ చేసినా కాపాడుకోలేకపోయామని విచారం
- బౌలింగ్ యూనిట్ అనుకున్నంతగా రాణించలేదని వ్యాఖ్య
గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ జట్టు ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఓటమి తర్వాత ముంబయి ఇండియన్ జట్టు తీవ్ర నిరాశకు లోనైంది. కెప్టెన్ హార్దిక్ పాండ్య సహా జట్టు సభ్యులు విచారంలో మునిగిపోయారు. పాండ్య మైదానంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. అయితే, ఈ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆడాడని పాండ్య మెచ్చుకున్నాడు. మ్యాచ్ అనంతరం పాండ్య ఈ వ్యాఖ్యలు చేశాడు. అవకాశాలను సద్వినియోగం చేసుకొని అయ్యర్ పరుగులు రాబట్టాడని చెప్పాడు. తమ జట్టు మంచి స్కోరే చేసినప్పటికీ బౌలింగ్ యూనిట్ అనుకున్నంతగా రాణించకపోవడంతో మ్యాచ్ చేజారిందని అన్నాడు.
ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ సారథి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 41 బంతుల్లో 87 పరుగులు చేశాడు. సిక్సర్ తో జట్టును విజయతీరానికి చేర్చాడు. ఇందులో 5 ఫోర్లు, 8 సిక్స్‌లు ఉన్నాయి. అంటే ఏకంగా 68 పరుగులు.. ఫోర్లు, సిక్స్‌ల ద్వారానే సాధించాడు. కాగా, ఈ ఓటమితో ముంబయి ఇంటిముఖం పట్టగా మంగళవారం ఇదే వేదికపై జరగనున్న ఫైనల్స్ లో పంజాబ్ కింగ్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.