మరోసారి కరోనా కలకలం... డబ్ల్యూహెచ్ఓ స్పందన

  • ఎల్‌ఎఫ్‌.7, ఎన్‌బీ.1.8.1 సబ్‌ వేరియంట్లను పర్యవేక్షణలో ఉంచిన డబ్ల్యూహెచ్‌ఓ
  • కొత్త వేరియంట్ల తీవ్రత తక్కువేనని, ఆందోళన వద్దని ఐసీఎంఆర్‌ వెల్లడి
  • అప్రమత్తత, సర్వసన్నద్ధత అవసరమని నిపుణుల సూచన
  • భారత్ లోనూ మళ్ళీ కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుదల
  • జూన్ 1 ఉదయం నాటికి దేశవ్యాప్తంగా 3,758 క్రియాశీల కేసులు 
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తి మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఇటీవల స్పందించింది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న ఎల్‌ఎఫ్‌.7, ఎన్‌బీ.1.8.1 సబ్ వేరియంట్లను 'పర్యవేక్షణలో ఉన్న వేరియంట్లు'గా వర్గీకరించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ మే 23న ఒక ప్రకటనలో పేర్కొంది. పలు దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్న ఎన్‌బీ.1.8.1 వేరియంట్ కారణంగా ఇన్ఫెక్షన్లు, ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య ఏకకాలంలో పెరుగుతున్నప్పటికీ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇతర వేరియంట్లతో పోలిస్తే ఇది తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుందనడానికి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఇప్పటికే ఆమోదం పొందిన కొవిడ్ వ్యాక్సిన్లు ఈ కొత్త వేరియంట్ లక్షణాలను, ప్రభావాన్ని తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయని భావిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.

ఐసీఎంఆర్‌ అంచనాలు.. అప్రమత్తత అవసరం

మరోవైపు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్‌) వెల్లడించిన సమాచారం ప్రకారం, దేశంలోని పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో జరిపిన జీనోమ్ సీక్వెన్సింగ్ నమూనాల ద్వారా ఈ కొత్త వేరియంట్లు ఒమిక్రాన్ జాతికి చెందిన ఉప రకాలుగా నిర్ధారణ అయ్యాయి. 2022లో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ వేగంగా వ్యాప్తి చెందడానికి ఒమిక్రాన్ వేరియంటే కారణమన్న సంగతి తెలిసిందే. మన దేశంలో ఎల్‌ఎఫ్‌.1, ఎక్స్‌ఎఫ్‌జీ, జేఎన్‌.1, ఎన్‌బీ.1.8.1 వంటి వేరియంట్లను గుర్తించగా, వీటిలో మొదటి మూడు వేరియంట్లే ఎక్కువగా వ్యాప్తిలో ఉన్నాయని ఐసీఎంఆర్‌ చీఫ్‌ రాజీవ్‌ బహల్‌ ఇటీవల వెల్లడించారు.

దేశంలో కరోనా వైరస్ మరోసారి కలకలం రేపుతోంది. రోజురోజుకూ కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం, జూన్ 1వ తేదీ ఉదయం 8 గంటల సమయానికి దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 3,758కి చేరింది. ఈ పరిణామం ప్రజల్లో మళ్లీ కొవిడ్ భయాలను రేకెత్తిస్తోంది.

వివిధ రాష్ట్రాల్లో కేసుల వివరాలు

తాజా గణాంకాల ప్రకారం, అత్యధికంగా కేరళలో 1400 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (485), దిల్లీ (436), గుజరాత్ (320), పశ్చిమ బెంగాల్ (287), కర్ణాటక (238) రాష్ట్రాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, ఆంధ్రప్రదేశ్‌లో 23 క్రియాశీల కేసులు ఉండగా, తెలంగాణలో 3 కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి మొత్తం 3,758 మంది కొవిడ్‌తో చికిత్స పొందుతున్నారు. ఈ ఏడాది కొవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 28కి చేరినట్లు అధికారిక సమాచారం.


More Telugu News