ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు సిద్ధమైన ప్రభాకర్‌రావు

  • ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ప్రభాకర్‌రావు
  • 5న సిట్ విచారణకు హాజరయ్యే అవకాశం
  • 14 నెలలుగా అమెరికాలో ఉంటున్న మాజీ ఐపీఎస్ అధికారి
  • సుప్రీంకోర్టు ఆదేశాలతో భారత్‌కు తిరుగు ప్రయాణం
  • విచారణకు సహకరిస్తానని కోర్టుకు అండర్‌టేకింగ్
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న విశ్రాంత ఐపీఎస్ అధికారి టి.ప్రభాకర్‌రావు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరుకానున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆయన ఈ నెల 5న సిట్ అధికారుల ముందు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

14 నెలలుగా అమెరికాలో ఉంటున్న ప్రభాకర్‌రావు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు భారత్‌కు తిరిగి రానున్నారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని సర్వోన్నత న్యాయస్థానానికి ఆయన ఒక హామీపత్రం కూడా సమర్పించినట్లు సమాచారం. వన్ టైమ్ ఎంట్రీ పాస్‌పోర్టు జారీ అయిన వెంటనే ఆయన భారత్‌కు బయలుదేరనున్నారు. పాస్‌పోర్టు అందిన మూడు రోజుల్లోగా దేశానికి తిరిగి రావాలని సుప్రీంకోర్టు ఇటీవలే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌రావు సిట్ విచారణకు హాజరవుతున్నట్లు దర్యాప్తు బృందానికి తెలియజేశారని తెలుస్తోంది.

ప్రభాకర్‌రావును విచారిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని, తద్వారా కేసు దర్యాప్తు ఒక కొలిక్కి వస్తుందని సిట్ అధికారులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఆయన విచారణ ఈ కేసులో అత్యంత కీలకంగా మారనుందని భావిస్తున్నారు.


More Telugu News