ఆ ఫొటోను చూసి చలించిపోయా: పహల్గామ్ ఉగ్రదాడిపై అనుపమ్ ఖేర్

  • పహల్గామ్ ఉగ్రదాడిపై నటుడు అనుపమ్ ఖేర్ తీవ్ర ఆవేదన
  • భర్త మృతదేహం వద్ద నవవధువు రోదన చూసి చలించిపోయానన్న ఖేర్
  • ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇలాంటి ఘటనలు బాధాకరం అన్న నటుడు
  • పహల్గామ్ దాడికి ప్రతీకారంగా పాక్‌పై భారత్ 'ఆపరేషన్ సిందూర్'
  • సాయుధ బలగాల సత్తాను కొనియాడిన అనుపమ్ ఖేర్
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఒక వ్యక్తి భార్య, నవ వధువు తన భర్త మృతదేహం వద్ద రోదిస్తున్న దృశ్యం తనను ఎంతగానో కలచివేసిందని బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను పంచుకున్నారు.

పహల్గామ్‌లో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమం అత్యంత దారుణమని ఆయన అన్నారు. "భారత్‌పై ఉగ్రవాదులు ఎన్నో దాడులకు తెగబడ్డారు. 1990 జనవరి 19న కశ్మీరీ పండితులు తమ సొంత ఇళ్లను వదిలి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌కు పర్యాటకుల రాక పెరిగిన తరుణంలో మళ్లీ ఇలాంటి దాడులు జరగడం చాలా బాధాకరం" అని ఆయన పేర్కొన్నారు. "పహల్గామ్‌లో జరిగిన దాడి తీవ్రంగా కలిచివేసింది. ముఖ్యంగా, తన భర్త మృతదేహం వద్ద ఓ నవ వధువు పడుతున్న ఆవేదన చూసి నేను చలించిపోయాను. ఈ ఘటనపై దేశం మొత్తం ఆగ్రహంతో ఉంది" అని అనుపమ్ ఖేర్ తెలిపారు.

పాకిస్థాన్‌పై భారత ప్రభుత్వం ప్రతీకార చర్యలు చేపట్టడాన్ని ఆయన సమర్థించారు. "పాకిస్థాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మన దేశం దాడి చేయడం సరైన నిర్ణయం. మన సాయుధ దళాలు తమ సత్తా ఏమిటో నిరూపించాయి. మన సైన్యం, నిఘా వర్గాలు అద్భుతంగా పనిచేశాయి," అంటూ ఆయన ప్రశంసించారు.


More Telugu News