ఆ విష‌యంలో ధ‌నిక రాష్ట్రాల కంటే ఏపీనే గ్రేట్: సీఎం చంద్ర‌బాబు

  • డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్న సీఎం చంద్ర‌బాబు
  • కాట్రేనికోన మండలం చెయ్యేరులో పింఛన్ల పంపిణీ
  • ధ‌నిక రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎక్కువ పింఛ‌న్లు ఇస్తున్నామ‌న్న సీఎం
  • ప్ర‌తినెలా 64 ల‌క్ష‌ల మందికి పింఛ‌న్లు అంద‌జేస్తున్నామని వెల్ల‌డి
ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం చెయ్యేరులో పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. ల‌బ్ధిదారుల ఇళ్ల‌కు వెళ్లి పింఛ‌న్లు అంద‌జేశారు. అనంత‌రం చెయ్యేరులో ఏర్పాటు చేసిన స‌భ‌లో సీఎం చంద్ర‌బాబు మాట్లాడారు. 

పింఛ‌న్లు పెంచుతామ‌ని చెప్పి... ఇచ్చిన‌మాట నిల‌బెట్టుకున్నామ‌ని చంద్ర‌బాబు అన్నారు. ఇచ్చిన హామీ ప్ర‌కారం ఫించ‌న్ల‌ను రూ. 3వేల నుంచి రూ. 4 వేల‌కు పెంచామ‌ని తెలిపారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన ఏడాది కాలంలోనే పింఛ‌న్ల కోసం రూ. 34వేల కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్లు చెప్పారు. 

పేద‌ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు పింఛ‌న్లు పెంచిన ఘ‌న‌త టీడీపీకే ద‌క్కుతుంద‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. మూడు నెల‌ల‌కు ఒక‌సారి ఇచ్చే పింఛ‌న్ల‌లో అద‌నంగా 9,176 మందికి ఇచ్చామ‌న్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో పింఛ‌న్లు ఇవ్వ‌డం లేద‌ని తెలిపారు. ప్ర‌తినెలా 1వ తేదీనే ప్ర‌భుత్వ ఉద్యోగుల‌తో పాటు 64 ల‌క్ష‌ల మంది పింఛ‌న్ దారుల‌కు పింఛ‌న్లు అంద‌జేస్తున్నామ‌న్నారు. 

ఇక‌, గ‌త వైసీపీ ప్ర‌భుత్వం వితంతు పింఛ‌న్లు ఇవ్వ‌లేదని చంద్ర‌బాబు విమ‌ర్శించారు. కానీ, కూట‌మి ప్ర‌భుత్వం 71,380 మందికి వితంతు ఫించ‌న్లు ఇచ్చిన‌ట్లు వెల్ల‌డించారు. ధ‌నిక రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎక్కువ పింఛ‌న్లు ఇస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ‌, మ‌హారాష్ట్రాల‌తో పోలిస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే అధిక పింఛ‌న్లు పంపిణీ చేస్తున్నామ‌ని సీఎం పేర్కొన్నారు. 

డ‌యాబెటీస్ కార‌ణంగా కాలు కోల్పోయిన పోలిశెట్టి దుర్గాప్ర‌సాద్ అనే వ్య‌క్తికి కూడా ఈ నెల నుంచే పింఛ‌న్ మంజూరు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఇక‌, 16,347 టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీ కోసం మెగా డీఎస్సీపై తొలి సంత‌కం చేశాన‌ని, దాని అమ‌లు చేసే దిశ‌గా త్వ‌రిత‌గ‌తిన ముందుకు వెళుతున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు వివ‌రించారు. 


More Telugu News