Donald Trump: భారత్-పాకిస్థాన్ ఘర్షణకు దిగితే ఆ ఒప్పందంపై ఆసక్తి తగ్గుతుంది: డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు

- త్వరలో భారత్‌తో వాణిజ్య ఒప్పందం జరగనుందన్న డొనాల్డ్ ట్రంప్
- వాణిజ్య ఒప్పందం చివరి దశలో ఉందన్న ట్రంప్
- చర్చలు గొప్పగా సాగుతున్నాయన్న అమెరికా అధ్యక్షుడు
- భారత్-పాక్ ఘర్షణకు దిగితే ఒప్పందంపై ఆసక్తి తగ్గుతుందన్న ట్రంప్
- అమెరికా సుంకాలకు బదులు ఒప్పందంపై భారత్ దృష్టి
భారత్‌తో కీలకమైన వాణిజ్య ఒప్పందం కుదిరే సమయం ఆసన్నమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో భారత్ నుంచి దిగుమతులపై అమెరికా సుమారు 26 శాతం మేర సుంకాలను విధించిన విషయం తెలిసిందే. ఈ సుంకాల వివాదాన్ని పరిష్కరించుకుని, ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని మరింత సులభతరం చేసే దిశగా ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరు దేశాలు కొంతకాలంగా చర్చలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా ట్రంప్ ఈ విషయాలను వెల్లడించారు.
భారత్‌తో సుంకాలపై చర్చలు సజావుగా సాగుతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఆ దేశంతో ఒక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకునేందుకు తాము చాలా సమీపంలో ఉన్నామని ఆయన అన్నారు.
అదే సందర్భంలో ఒక కీలకమైన వ్యాఖ్య కూడా చేశారు. ఒకవేళ భారత్, పాకిస్థాన్‌లు ఘర్షణల బాట పడితే, వారితో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలన్న ఆసక్తి తనకు ఉండబోదని ట్రంప్ స్పష్టం చేశారు. వాణిజ్యపరమైన అంశాలపై చర్చించేందుకు పాకిస్థాన్ నుంచి కూడా ప్రతినిధుల బృందం వచ్చే వారంలో వాషింగ్టన్‌కు రానుందని ఆయన తెలియజేశారు.
ఇదిలా ఉండగా, భారత్, అమెరికాల మధ్య మొదటి దశ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం ఎప్పటినుంచో చర్చలు కొనసాగుతున్నాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్‌తో ఈ విషయమై సమావేశమయ్యారు. ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ మాసాల కల్లా ఈ మొదటి దశ ఒప్పందాన్ని ఒక కొలిక్కి తేవాలని ఇరు పక్షాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ చర్చల ద్వారా ప్రధానంగా రెండు దేశాల మార్కెట్లను పరస్పరం వినియోగించుకోవడం, స్థానిక నిబంధనల అమలు తీరు, సుంకాల మినహాయింపులకు సంబంధించిన పరిమితులు వంటి అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.