పాట్నా ఎయిర్ పోర్టులో క్రికెట్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీతో ప్రధాని మోదీ ముచ్చట్లు

  • పాట్నా విమానాశ్రయంలో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని కలిశానని మోదీ వెల్లడి
  • వైభవ్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులతో కూడా భేటీ అయ్యానంటూ వివరణ
  • వైభవ్ భవిష్యత్ ప్రయత్నాలకు నా శుభాశీస్సులు ఉంటాయంటూ ట్వీట్
ఇటీవల భారత క్రికెట్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ లో సంచలన  ఇన్నింగ్స్ లతో ఈ 14 ఏళ్ల  చిచ్చరపిడుగు అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఇవాళ బీహార్ రాజధాని పాట్నా ఎయిర్ పోర్టులో వైభవ్ సూర్యవంశీ తన కుటుంబ సభ్యులతో వెళ్లి దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిశాడు. ఈ విషయాన్ని మోదీ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. 

"పాట్నా విమానాశ్రయంలో యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీని, అతడి కుటుంబ సభ్యులను కలవడం జరిగింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం అతడి క్రికెట్ నైపుణ్యాలను అందరూ ఎంతగానో ఆరాధిస్తున్నారు.

ఈ యువ క్రీడాకారుడి ప్రతిభ నిజంగా అద్భుతం. చాలా చిన్న వయసులోనే క్రికెట్‌లో అతడు కనబరుస్తున్న ప్రతిభ, ఆట పట్ల అతడికున్న అంకితభావం ప్రశంసనీయం. దేశంలోని నలుమూలల నుంచి వైభవ్ ఆటతీరుకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని తెలుసుకుని చాలా సంతోషించాను.

వైభవ్‌తో మాట్లాడినప్పుడు, అతడి కళ్ళల్లో క్రికెట్ పట్ల ఉన్న తపన, ఏదో సాధించాలనే పట్టుదల స్పష్టంగా కనిపించాయి. ఇలాంటి యువ ప్రతిభావంతులే మన దేశానికి గర్వకారణం. అతడి కుటుంబ సభ్యులు కూడా ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నారని అర్థమైంది.

వైభవ్ సూర్యవంశీ భవిష్యత్ ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అతడు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను. నా శుభాశీస్సులు అతడికి ఎప్పుడూ ఉంటాయి" అని మోదీ వివరించారు. 


More Telugu News