ప్ర‌భుత్వాధికారి ఇంట్లో నోట్ల క‌ట్ట‌లు.. విజిలెన్స్‌కు చిక్కిన భారీ అవినీతి తిమింగ‌లం

  • రూ. 2కోట్లకు పైగా స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారులు 
  • ఒడిశాలోని అంగుల్, భువనేశ్వర్, పిపిలిలోని ఏడు ప్రదేశాలలో ఏకకాలంలో దాడులు
  • చీఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న బైకుంత నాథ్ సారంగి 
  • ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో సోదాలు
ఒడిశాలోని భువ‌నేశ్వ‌ర్‌లో ఓ భారీ అవినీతి తిమింగ‌లం విజిలెన్స్‌కు చిక్కింది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న బైకుంత నాథ్ సారంగి నివాసాల్లో దాడులు చేయ‌గా రూ. 2కోట్ల‌కు పైగా న‌గ‌దు బ‌య‌ట‌ప‌డింది. ఒడిశాలోని అంగుల్, భువనేశ్వర్, పిపిలి (పూరి) లోని ఏడు ప్రదేశాలలో ఏకకాలంలో జరిపిన దాడుల్లో విజిలెన్స్ విభాగం దాదాపు రూ.2.1 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది.

అయితే, విజిలెన్స్ అధికారులు వచ్చేసరికి సారంగి తన ఫ్లాట్ కిటికీలోంచి బయటకు విసిరి నగదు కట్టలను పారవేసేందుకు ప్రయత్నించాడు. వెంట‌నే అత‌డిని అదుపులోకి తీసుకుని ఆ నోట్ల‌ కట్టలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంగుల్‌లోని అత‌ని నివాసంలో రూ.1.1 కోట్లు, భువనేశ్వర్ ఫ్లాట్‌లో మరో కోటి రూపాయలు దొరికాయి.

సారంగి తన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరిగాయి. ఎనిమిది మంది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారులు, 12 మంది ఇన్స్పెక్టర్లు, ఆరుగురు అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్లు సహా 26 మంది పోలీసు అధికారుల బృందంతో పాటు ఇతర సహాయక సిబ్బంది ఈ సోదాలు నిర్వహించారు.


More Telugu News