Indians: ఇరాన్‌లో ముగ్గురు భారతీయుల మిస్సింగ్.. ఆచూకీ కోసం ఎంబసీ ప్రయత్నం

- ముగ్గురు భారతీయులు మిస్సింగ్ అంటూ టెహ్రాన్‌లోని భారత ఎంబసీ వెల్లడి
- వారిని అత్యవసరంగా కనుగొనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న రాయబార కార్యాలయం
- పంజాబ్ నుంచి ఇరాన్ వెళ్లిన హుషన్‌ప్రీత్ సింగ్, జస్పాల్ సింగ్, అమృత్‌పాల్ సింగ్
- మే 1న టెహ్రాన్‌లో దిగిన కొద్దిసేపటికే ముగ్గురూ అదృశ్యం
ఇరాన్‌కు వెళ్లిన ముగ్గురు భారతీయులు తప్పిపోయారు. ప్రస్తుతం వారి ఆచూకీ కోసం టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ మేరకు తాజాగా ఎంబసీ ప్రకటన విడుదల చేసింది. పంజాబ్‌లోని సంగ్రూర్, హోషియార్‌పూర్, ఎస్‌బీఎస్ నగర్ నుంచి ఇరాన్‌కు వెళ్లిన ముగ్గురు భారతీయులు తప్పిపోయారని టెహ్రాన్‌లోని ఇండియన్ ఎంబసీ వెల్లడించింది. వారిని అత్యవసరంగా కనుగొనే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాయబార కార్యాలయం తెలిపింది.
తప్పిపోయిన ముగ్గురు వ్యక్తులను హుషన్‌ప్రీత్ సింగ్ (సంగ్రూర్), జస్పాల్ సింగ్ (ఎస్‌బీఎస్ నగర్), అమృత్‌పాల్ సింగ్ (హోషియార్‌పూర్)గా గుర్తించారు. మే 1న టెహ్రాన్‌లో దిగిన కొద్దిసేపటికే వారందరూ అదృశ్యమయ్యారు.
"ఇరాన్‌కు వెళ్లిన తర్వాత తమ బంధువులు కనిపించడం లేదని ముగ్గురు భారతీయ పౌరుల కుటుంబ సభ్యులు భారత రాయబార కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఎంబసీ ఇరాన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. తప్పిపోయిన భారతీయులను తక్షణమే గుర్తించి వారికి భద్రత కల్పించాలని అభ్యర్థించింది" అని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా, తప్పిపోయిన ఆ ముగ్గురి ఆచూకీ కోసం తాము చేస్తున్న ప్రయత్నాల గురించి వారి కుటుంబ సభ్యులకు క్రమం తప్పకుండా తెలియజేస్తున్నామని ఎంబసీ తెలియజేసింది.