Flipkart: తీపి క‌బురు చెప్పిన ఫ్లిప్‌కార్ట్.. ఈ ఏడాది 5 వేల ఉద్యోగాల భ‌ర్తీ!

5000 Jobs at Flipkart Focus on Quick Commerce and AI
  • క్విక్‌ కామర్స్‌, ఫిన్‌టెక్, కృత్రిమ మేధ రంగాల్లో విస్తరణపై దృష్టి 
  • ఈ ప్రణాళికలో భాగంగా కొత్త‌ నియామ‌కాలు
  • ‘మినిట్స్‌’ పేరిట క్విక్‌ కామర్స్‌ సేవలు అందిస్తున్న ఫ్లిప్‌కార్ట్‌
  • యూపీఐ పేమెంట్స్ కోసం సూపర్‌.మనీ పేరుతో అప్లికేషన్‌
  • ఈ విభాగాల్లో డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో నూతన నియామకాలు 
వాల్‌మార్ట్‌కు చెందిన ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నిరుద్యోగుల‌కు తీపి క‌బురు చెప్పింది. ఈ ఏడాది కొత్తగా 5 వేల మందిని రిక్రూట్ చేసుకోనున్న‌ట్లు వెల్ల‌డించింది. క్విక్‌ కామర్స్‌, ఫిన్‌టెక్, కృత్రిమ మేధ రంగాల్లో విస్తరణపై దృష్టి సారించే ప్రణాళికలో భాగంగా ఈ నియామ‌కాలు చేప‌డుతున్న సంస్థ తెలిపింది. 

మే 26న జరిగిన కంపెనీ టౌన్‌హాల్ అయిన ఫ్లిప్‌స్టర్ కనెక్ట్‌లో చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆఫీసర్‌ సీమా నాయర్ ఈ నియామక ప్రణాళికను ఆవిష్కరించారని సంబంధిత‌ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ‘మినిట్స్‌’ పేరిట క్విక్‌ కామర్స్‌ సేవలు అందిస్తున్న ఫ్లిప్‌కార్ట్‌ తన వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తోంది. 

వినియోగదారులకు వేగవంతమైన డెలివరీ సేవలు అందించేందుకు కృషి చేస్తోంది. యూపీఐ (UPI) పేమెంట్స్‌ జరిపేందుకు సూపర్‌.మనీ పేరుతో తీసుకొచ్చిన అప్లికేషన్‌పై దృష్టి సారించింది. ఈ విభాగాల్లో డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో నూతన నియామకాలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నట్లు స‌మాచారం.

బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి ప్రత్యర్థులతో పోటీ పడుతూ... కిరాణా, నిత్యావసర వస్తువులలో అల్ట్రా-ఫాస్ట్ డెలివరీలకు పెరుగుతున్న డిమాండ్‌ను ఉపయోగించుకోవడం ఈ మినిట్స్ లక్ష్యం. ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి మాట్లాడుతూ... ‘మినిట్స్‌’ చాలా బాగా పనిచేస్తోంది. హైపర్‌లోకల్ మార్కెట్‌లో నెల‌కొన్న తీవ్ర‌మైన పోటీని త‌ట్టుకునేందుకు ఫ్లిప్‌కార్ట్ చేస్తున్న ప్రయత్నాలలో ఇది కీల‌క‌మ‌ని అన్నారు. కొత్త నియామకాలు ఫిన్‌టెక్‌లోని ఉత్పత్తి అభివృద్ధి, సాంకేతికత, వ్యాపార విధులను బలోపేతం చేస్తాయని ఆయ‌న పేర్కొన్నారు.

ఇక‌, జూన్ నాటికి కస్టమర్, ఆర్డర్ వాల్యూమ్‌లలో 30 శాతం వృద్ధిని ఫ్లిప్‌కార్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానంగా ఫ్యాషన్ విభాగం ఇందులో కీరోల్ పోషిస్తోంది. ఇది ఇప్పుడు దాదాపు 40 శాతం కొత్త కస్టమర్‌లను కలిగి ఉంది. కంపెనీ టెక్నాలజీ, ఏఐ (AI) లలో కూడా మరిన్ని పెట్టుబడులు పెడుతోంది. ఈ సంవత్సరం ఏఐ పెట్టుబడులు ఆరు రెట్లు పెరిగాయి.
Flipkart
Flipkart jobs
e-commerce jobs
Kalyan Krishnamurthy
Quick Commerce
Fintech jobs
artificial intelligence
Walmart
Flipster Connect
India jobs

More Telugu News