ఈ ఓట‌మి నుంచి మేము చాలా నేర్చుకుంటాం: హార్దిక్ పాండ్య‌

  • జైపూర్ వేదిక‌గా నిన్న త‌ల‌ప‌డ్డ‌ పీబీకేఎస్‌, ఎంఐ
  • టాప్‌-2 బెర్త్‌ కోసం ఇరుజ‌ట్ల హోరాహోరీ పోరు
  • ముంబ‌యిని 7 వికెట్ల తేడాతో ఓడించి అగ్ర‌స్థానానికి దూసుకెళ్లిన పంజాబ్ 
  • ఈ ఓట‌మిపై మ్యాచ్ అనంత‌రం ఎంఐ కెప్టెన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు
ఐపీఎల్‌లో భాగంగా సోమ‌వారం జైపూర్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌)తో జ‌రిగిన ఆఖ‌రి లీగ్ మ్యాచ్‌లో ముంబ‌యి ఇండియ‌న్స్ (ఎంఐ) ప‌రాజ‌యం పాలైన విష‌యం తెలిసిందే. టాప్‌-2 బెర్త్‌ కోసం ఇరుజ‌ట్లు హోరాహోరీ త‌ల‌ప‌డ్డాయి. కానీ, ముంబ‌యిని పంజాబ్ ఏడు వికెట్ల తేడాతో ఓడించి అగ్ర‌స్థానానికి దూసుకెళ్లింది. దీంతో ముంబ‌యి నాలుగో స్థానంతో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. ఇప్పుడు ఎలిమినేట‌ర్ మ్యాచ్ ఆడాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. 

ఈ ప‌రాజ‌యంపై మ్యాచ్ అనంత‌రం ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్య స్పందించాడు. ఈ ఓట‌మి త‌మ‌కు ఓ మేల్కొలుపులాంటిద‌న్నాడు. దీని నుంచి తాము చాలా నేర్చుకుంటామ‌ని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో త‌మ జ‌ట్టు ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక‌పోయింద‌ని పేర్కొన్నాడు. ముంబ‌యి ఇంకో 20 ర‌న్స్ అధికంగా చేసి ఉంటే... ఫ‌లితం మ‌రోలా ఉండేద‌న్నాడు. 

యాక్సిల‌రేట‌ర్ మీద మ‌నం కాలు తీస్తే... ప్ర‌త్య‌ర్థులు గెల‌వ‌డానికి ప్ర‌య‌త్నిస్తార‌ని పాండ్య అన్నాడు. ఇదో చిన్న త‌ప్పిద‌మ‌ని పేర్కొన్నాడు. అలాగే త‌మ బౌలింగ్ విభాగం కూడా  ప‌లు త‌ప్పిదాలు చేసింద‌ని తెలిపాడు. త‌మ బౌల‌ర్లు కొన్ని పేల‌వ‌మైన బంతులు సంధించ‌డంతో ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు బ్యాట‌ర్ల‌కు ప‌రుగులు చేయ‌డం సులువుగా మారింద‌న్నాడు. 

అదే స‌మ‌యంలో మ‌రికొన్ని చ‌క్క‌టి బంతుల‌కు కూడా పంజాబ్ బ్యాట‌ర్లు ర‌న్స్ రాబ‌ట్టార‌ని చెప్పాడు. మొత్తానికి త‌మ బౌలింగ్ వైఫ‌ల్యాల‌ను వారు చాలా చ‌క్క‌గా వినియోగించుకుని, మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్నార‌ని పాండ్య చెప్పుకొచ్చాడు. 




More Telugu News