Pemmasani Chandrasekhar: ఏపీ రాజధానికి 2024 నుంచి చట్టబద్ధత: కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని

Pemmasani Chandrasekhar AP Capital Amaravati to Get Legal Status From 2024
  • అమరావతి రాజధానిగా శాశ్వతమన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని
  • రాజధాని చట్టబద్ధతకు కేంద్రం అంగీకారం తెలిపిందన్న పెమ్మసాని 
  • రాజధాని ప్రాంతంలో పలు ఐటీ కంపెనీల ఏర్పాటుకు సీఎంతో చర్చిస్తానని వెల్లడి
భవిష్యత్తులో రాజధాని అమరావతిని ఎవరూ కదిలించకుండా శాశ్వత చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. 2024 నుంచే ఈ చట్టబద్ధత అమల్లోకి వస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ అంశంపై ఇప్పటికే అటార్నీ జనరల్‌తో చర్చలు జరిగాయని చెప్పారు.

తాడేపల్లిలోని తన నివాసంలో నిన్న మీడియాతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. అమరావతికి త్వరలో ప్రత్యేక పిన్‌కోడ్, ఎస్‌టిడీ, ఐఎస్‌డీ కోడ్‌లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. విభజన చట్టం ప్రకారం అమరావతికి కేటాయించిన కేంద్ర సంస్థలతో చర్చలు జరిపి, వాటి కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తాను పర్యవేక్షిస్తున్న తపాలా శాఖ కేంద్ర కార్యాలయ పనులు మూడు నెలల్లోనే ప్రారంభమవుతాయని వెల్లడించారు.

రాజధాని ప్రాంతంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తూ వారిలో సంతృప్తి కలిగిస్తున్నామని ఆయన అన్నారు. రాజధానిలో జనసాంద్రతను పెంచేందుకు ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షిస్తామని, అలాగే కొన్ని ఐటీ కంపెనీల ఏర్పాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చిస్తానని పెమ్మసాని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ కాంప్లెక్సులు, హైకోర్టు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారులు, సిబ్బంది నివాస సముదాయాలను రెండేళ్లలో పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రైలు, రోడ్డు కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటు ఎల్‌పీఎస్ లేఅవుట్ల పనులు వేగవంతం చేస్తున్నామని చెప్పారు.

ప్లాట్ల పరిమాణాలను తగ్గిస్తే హైదరాబాద్‌లోని మరో పాతబస్తీగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలా కాకుండా వరల్డ్ క్లాస్ సిటీగా రాజధానిని నిర్మించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని, అందుకు అందరూ సహకరించాలని పెమ్మసాని విజ్ఞప్తి చేశారు. 
Pemmasani Chandrasekhar
Amaravati
Andhra Pradesh Capital
AP Capital City
Amit Shah
Central Government
Capital Legal Status
TDP
Chandrababu Naidu
New Pin Code

More Telugu News