స‌చిన్ 15 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన సూర్యకుమార్ యాదవ్

  • జైపూర్ వేదిక‌గా పీబీకేఎస్‌, ఎంఐ మ్యాచ్‌
  • ఏడు వికెట్ల తేడాతో ముంబ‌యిని ఓడించిన పంజాబ్‌
  • మ‌రోసారి బ్యాట్ ఝుళిపించిన సూర్యకుమార్ 39 బంతుల్లో 57 ర‌న్స్‌
  • ముంబ‌యి త‌ర‌ఫున ఒక సీజ‌న్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన బ్యాట‌ర్‌గా సూర్య‌కుమార్‌
సోమ‌వారం జైపూర్ వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌), ముంబ‌యి ఇండియ‌న్స్ (ఎంఐ) త‌ల‌ప‌డ్డాయి. పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్‌-2 బెర్త్‌ల కోసం జ‌రిగిన ఈ పోరులో ముంబ‌యిని పంజాబ్ ఓడించింది. త‌ద్వారా ఆల్‌రౌండ‌ర్ ప్ర‌ద‌ర్శ‌న‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ సార‌థ్యంలోని పీబీకేఎస్ అగ్ర‌స్థానానికి దూసుకెళ్లింది. 

ఇక‌, ఈ సీజన్‌లో నిలకడగా ఆడుతున్న ఎంఐ స్టార్ ప్లేయ‌ర్‌ సూర్యకుమార్ మ‌రోసారి బ్యాట్ ఝుళిపించాడు. 39 బంతుల్లో 57 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలో సచిన్ టెండూల్కర్ 15 ఏళ్ల  రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. ఒక ఐపీఎల్ సీజ‌న్‌లో ముంబ‌యి త‌ర‌ఫున అత్య‌ధిక ప‌రుగులు చేసిన రికార్డు ఇప్ప‌టివ‌ర‌కు స‌చిన్ పేరిట ఉండేది. 2010 ఐపీఎల్‌లో మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌ 618 ప‌రుగులు చేశాడు. ఇప్పుడు ఈ రికార్డును సూర్య‌కుమార్ అధిగ‌మించాడు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఇప్పటివరకు 628 ర‌న్స్ చేశాడు. 

కాగా, నిన్న‌టి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. 185 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 18.3 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని అందుకుంది. ఏడు వికెట్ల తేడాతో ముంబయిని చిత్తు చేసింది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ ప్రియాంశ్ ఆర్య (62), జోష్ ఇంగ్లిస్ (73) హాఫ్ సెంచ‌రీల‌తో జ‌ట్టుకు విజ‌యాన్ని అందించారు. 




More Telugu News