జైలు ఖైదీల జల్సాలు.. భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్‌తో హోటళ్లలో!

  • వైద్య పరీక్షల పేరుతో జైలు నుంచి ఖైదీల షికార్లు
  • భార్యలు, ప్రియురాళ్లతో హోటళ్లలో గడిపిన ఖైదీలు
  • గార్డులకు లంచాలిచ్చి బయట తిరిగిన వైనం
  • జైలు నుంచే వీఐపీలకు బెదిరింపు కాల్స్ గుట్టురట్టు
జైపూర్‌లో ఒక విచిత్రమైన సంఘటన వెలుగు చూసింది. జైలులో శిక్ష అనుభవిస్తున్న కొందరు ఖైదీలు, వైద్య పరీక్షల పేరుతో బయటకు వచ్చి, ఏకంగా హోటళ్లలో తమ భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్‌తో గడిపినట్లు వెలుగులోకి వచ్చింది. శనివారం నాడు ఈ ఘటన చోటుచేసుకోగా, సాయంత్రం అయినా ఖైదీలు తిరిగి జైలుకు రాకపోవడంతో అధికారులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.

అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, జైపూర్ సెంట్రల్ జైలు నుంచి శనివారం రఫీక్ బక్రి, భన్వర్ లాల్, అంకిత్ బన్సాల్, కరణ్ అనే నలుగురు ఖైదీలను వైద్య పరీక్షల నిమిత్తం కానిస్టేబుళ్లు బయటకు తీసుకువెళ్లారు. ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకున్న ఖైదీలు, తమను సాయంత్రం వరకు బయట వదిలేస్తే ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున లంచం ఇస్తామని అక్కడి గార్డులను కోరారు. దీనికి ఆ కానిస్టేబుళ్లు అంగీకరించడంతో ఖైదీలు బయటకు వెళ్లిపోయారు.

అయితే, ఖైదీలు సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో జైలు అధికారులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో, ఒక హోటల్‌లో రఫీక్‌ తన భార్యతో ఉండగా, భన్వర్‌ తన మాజీ ప్రియురాలితో ఉన్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. రఫీక్‌ భార్య వద్ద మాదకద్రవ్యాలు లభించడంతో ఆమెపై కూడా కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన ఇద్దరు ఖైదీలు, అంకిత్ బన్సాల్, కరణ్ గుప్తా, విమానాశ్రయానికి సమీపంలోని ఒక హోటల్‌లో ఉన్నట్లు తెలియడంతో పోలీసులు వారిని కూడా పట్టుకున్నారు. కరణ్‌తో పాటు ఉన్న అతని బంధువు వద్ద పలువురు ఖైదీలకు చెందిన ఐడీ కార్డులు, సుమారు 45 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేయగా మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. జైలులో ఉన్న ఒక దోపిడీ దొంగ, ఈ ఖైదీలు బయటకు పారిపోవడానికి ప్రణాళిక వేసినట్లు దర్యాప్తులో తేలిందని అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా, జైలులోని కొందరు కానిస్టేబుళ్లకు లంచాలు ముట్టజెప్తూ ఖైదీలు దొంగతనంగా ఫోన్లు వాడుతున్నారని, ఆ ఫోన్ల ద్వారా ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మతో పాటు పలువురు వీఐపీలకు బెదిరింపు కాల్స్ చేస్తున్నారని కూడా గుర్తించినట్లు వారు చెప్పారు. ఈ కేసులో మొత్తం ఐదుగురు కానిస్టేబుళ్లు, నలుగురు ఖైదీలు, వారికి సహకరించిన వారి బంధువులు సహా మొత్తం 13 మందిని అరెస్ట్‌ చేసినట్లు సోమవారం మీడియాకు అధికారులు వివరించారు.


More Telugu News