దశాబ్దాల నాటి సంకెళ్లను బద్దలు కొట్టాం: ప్రధాని మోదీ

  • గుజరాత్‌లోని దాహోద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన
  • సుమారు రూ.24 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపన
  • భారత్‌ను ద్వేషించడమే పాకిస్థాన్ పని అని తీవ్ర విమర్శలు
  • దేశీయ తయారీ రంగం వేగంగా వృద్ధి చెందుతోందని వెల్లడి
  • రెండు కొత్త రైళ్లతో పాటు, ఎలక్ట్రిక్ లోకోమోటివ్ తయారీ కేంద్రం ప్రారంభం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం గుజరాత్‌లోని దాహోద్‌లో పర్యటించి, సుమారు రూ.24 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని, దేశ తయారీరంగం వేగంగా వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.

దాహోద్ పర్యటనలో భాగంగా, వెరావల్-అహ్మదాబాద్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు, వల్సాద్-దాహోద్ మధ్య మరో ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రధాని మోదీ పచ్చజెండా ఊపారు. దీంతో పాటు, ఇక్కడే నెలకొల్పిన ఎలక్ట్రిక్ లోకోమోటివ్ తయారీ కేంద్రాన్ని కూడా ఆయన ప్రారంభించారు.

మూడు సంవత్సరాల క్రితం ఈ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశామని గుర్తుచేసిన ప్రధాని, "ఎన్నికల సమయంలో పునాది వేశారు కానీ నిర్మాణాలు చేపట్టరని అప్పట్లో కొందరు విమర్శించారు. కానీ ఈ రోజు ఇక్కడ తయారైన ఎలక్ట్రిక్ లోకోమోటివ్ మన కళ్లముందు కనిపిస్తోంది" అని అన్నారు. దేశాన్ని 'వికసిత్ భారత్' దిశగా మార్చేందుకు 140 కోట్ల మంది ప్రజలు ఐక్యంగా కృషి చేస్తున్నారని తెలిపారు.

తయారీ హబ్‌గా భారత్

"ఈ 11 ఏళ్లలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నాం. దశాబ్దాల నాటి సంకెళ్లను బద్దలు కొట్టి, దేశాన్ని ఓ పెద్ద తయారీ కేంద్రంగా మారుస్తున్నాం. ఇప్పుడు కార్లు, ఫోన్లు, బొమ్మలు, ఆయుధాలను కూడా ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నాం" అని ప్రధాని మోదీ వివరించారు.

నాటి జ్ఞాపకాలు, నేటి ప్రగతి

2014లో ఇదే రోజు తాను తొలిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టానని నరేంద్ర మోదీ గుర్తుచేసుకున్నారు. తొలుత గుజరాత్ ప్రజలు తనను ఆశీర్వదించారని, ఆ తర్వాత కోట్లాది మంది భారతీయుల ఆశీస్సులు లభించాయని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు ఆయనను ఘనంగా సత్కరించారు.


More Telugu News