Raja Kolander: నరమాంస భక్షకుడికి యావజ్జీవం.. కోర్టులో నవ్వుతూనే కనిపించిన సీరియల్ కిల్లర్!

Raja Kolander Serial Killer Gets Life Sentence
  • సీరియల్ కిల్లర్ రాజా కోలందర్‌కు యావజ్జీవ శిక్ష
  • అతడి అనుచరుడు బక్ష్‌రాజ్‌కు కూడా జీవిత ఖైదు
  • ఇద్దరి హత్య కేసులో లఖ్‌నవూ కోర్టు తీర్పు
  • మనిషి తలలతో సూప్ తాగేవాడన్న ఆరోపణలు
  • జర్నలిస్టు హత్య దర్యాప్తులో బయటపడ్డ కిరాతకుడి నేరాలు
  • కోలందర్ ఇంట్లో 14 హత్యల వివరాలతో డైరీ లభ్యం
ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వరుస హత్యల కేసులో రామ్ నిరంజన్ అలియాస్ రాజా కోలందర్, అతడి అనుచరుడు బక్ష్‌రాజ్‌కు లక్నో కోర్టు జీవిత ఖైదు విధించింది. ఇద్దరు వ్యక్తులను కిరాతకంగా హతమార్చిన కేసులో ఈ తీర్పు వెలువరించింది. కోలందర్ ఒక నరమాంస భక్షకుడని, మనుషుల తలలతో సూప్ తయారుచేసుకుని తాగేవాడన్న ఆరోపణలున్నాయి.

ఈ కేసులో న్యాయమూర్తి శిక్షను ప్రకటిస్తున్న సమయంలో కోలందర్ ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం గానీ, భయం గానీ కనిపించలేదని, పైగా నవ్వుతూ కనిపించాడని తెలిసింది. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన జర్నలిస్టు ధీరేంద్ర సింగ్ హత్య కేసు కోలందర్‌పై నమోదైన మొదటి ఎఫ్ఐఆర్. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. అతడి నేరాల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడింది.

ధీరేంద్ర సింగ్ హత్య కేసు విచారణలో భాగంగా పోలీసులు కోలందర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. అక్కడ వారికి మనుషుల పుర్రెలు కనిపించడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాటి గురించి కోలందర్‌ను గట్టిగా ప్రశ్నించడంతో 25 ఏళ్ల క్రితం అంటే 2000వ సంవత్సరంలో మనోజ్ అనే వ్యక్తిని, అతడి డ్రైవర్‌ రవిని తానే హత్య చేసినట్టు అంగీకరించాడు. వారిద్దరి మృతదేహాలను ముక్కలుగా నరికి పూడ్చిపెట్టినట్లు కోలందర్, అతడి అనుచరుడు బక్ష్‌రాజ్‌లు పోలీసులకు తెలిపారు.

జర్నలిస్ట్ ధీరేంద్రను పిప్రీ ప్రాంతంలోని తన ఫామ్‌హౌస్‌కు రప్పించి హత్య చేసినట్టు కూడా కోలందర్ విచారణలో ఒప్పుకున్నాడు. కోలందర్ ఇంట్లో పోలీసులు సోదాలు చేయగా 14 హత్యలకు సంబంధించిన వివరాలు ఉన్న ఒక డైరీ కూడా లభించింది.

శంకర్‌గఢ్‌కు చెందిన కోలందర్‌, గతంలో ఛోకిలోని సెంట్రల్ ఆర్డినెన్స్ డిపోలో నాలుగో తరగతి ఉద్యోగిగా పనిచేసేవాడు. రామ్ నిరంజన్ అసలు పేరు కాగా, తనను తాను రాజుగా ఊహించుకుంటూ పేరు చివర ‘రాజా’ అని తగిలించుకున్నాడు. తన భార్యను కూడా ‘పూలన్‌దేవి’ అని పిలిచేవాడని సమాచారం.
Raja Kolander
Ram Niranjan
Uttar Pradesh
serial killer
cannibalism
murder case
Lucknow court
Dhirendra Singh
Prayagraj
crime

More Telugu News