సిట్ ఆహ్వానిస్తే.. లిక్క‌ర్ స్కామ్‌లో బ‌య‌ట‌కు రాని విష‌యాలు వెల్ల‌డిస్తా: ఎంపీ సీఎం ర‌మేశ్‌

  • వైసీపీ హ‌యాంలో జ‌రిగిన లిక్క‌ర్ స్కామ్‌పై బీజేపీ ఎంపీ సీఎం ర‌మేశ్ కీల‌క వ్యాఖ్య‌లు
  • ఈ కుంభ‌కోణంలోని చాలా విష‌యాల‌పై సిట్ ఇంకా దృష్టిసారించ‌లేదన్న బీజేపీ ఎంపీ
  • మ‌ద్యం దుకాణాల్లో కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో ప‌నిచేసిన ఉద్యోగుల జీతాల నుంచి క‌మీష‌న్ తీసుకున్నార‌ని ఆరోప‌ణ‌
  • వాటి తాలూకు సాక్ష్యాధారాలు త‌న వ‌ద్ద ఉన్నాయన్న సీఎం ర‌మేశ్‌
గ‌త వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన లిక్క‌ర్ స్కామ్ విష‌య‌మై బీజేపీ ఎంపీ సీఎం ర‌మేశ్ తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ మ‌ద్యం కుంభ‌కోణంలోని చాలా విష‌యాల‌పై సిట్ ఇంకా పూర్తిగా దృష్టిసారించ‌లేదని ఆయ‌న పేర్కొన్నారు. సిట్ ఆహ్వానిస్తే తాను వెళ్లి లిక్క‌ర్ స్కామ్‌లో బ‌య‌ట‌కు రాని విష‌యాలు వెల్ల‌డిస్తాన‌న్నారు. 

ఢిల్లీలోని త‌న నివాసంలో శ‌నివారం ఎంపీ సీఎం ర‌మేశ్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ హ‌యాంలో మ‌ద్యం దుకాణాల్లో కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో ప‌నిచేసిన ఉద్యోగుల జీతాల నుంచి ప్ర‌తి నెలా రూ. 5 కోట్లు జ‌గ‌న్ మ‌నుషులు క‌మీష‌న్‌గా వ‌సూలు చేశారు. మ‌ద్యం దుకాణాలు, డిపోల వ‌ద్ద నియ‌మించిన దాదాపు 11వేల మంది సెక్యూరిటీ సిబ్బంది వేత‌నాల నుంచి కూడా క‌మీష‌న్ల రూపంలో నెల‌కు రూ. 3 కోట్లు వ‌సూలు చేసిన‌ట్లు నా వ‌ద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయి అని ఆయ‌న అన్నారు. 

ఇక‌, విద్యుత్ కొనుగోళ్ల‌లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగినట్లు నిరూపిస్తే తాను రాజ‌కీయ స‌న్యాసం తీసుకోవ‌డానికి సిద్ధంగా ఉన్నాన‌ని అన్నారు. లేదంటే జ‌గ‌న్ రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటారా అని సీఎం ర‌మేశ్ స‌వాల్ చేశారు. 

ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబును వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ అప్పుల సామ్రాట్ అని వ్యాఖ్యానించ‌డంపై కూడా సీఎం ర‌మేశ్ స్పందించారు. "మాజీ సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న ప్ర‌కారం రాష్ట్రం ఏర్ప‌డే నాటికి రూ. ల‌క్ష కోట్ల అప్పు ఉంటే... ఆ త‌ర్వాత చంద్ర‌బాబు రూ. 2,49,350 కోట్ల అప్పు చేశారు. 2019-24 మ‌ధ్య కాలంలో త‌మ పాల‌న‌లో రూ. 3.32 ల‌క్ష‌ల కోట్లు అప్పు చేసిన‌ట్లు జ‌గ‌న్ ప్ర‌క‌టించుకున్నారు. గ‌త సీఎం కంటే దాదాపు రూ. ల‌క్ష కోట్లు అధికంగా అప్పు చేసిన వ్య‌క్తి చంద్ర‌బాబును అప్పుల సామ్రాట్ అని విమ‌ర్శించ‌డం హ‌స్యాస్ప‌దంగా ఉంది" అని ఎద్దేవా చేశారు. 


More Telugu News