Preity Zinta: పంజాబ్ కింగ్స్ జట్టు యాజమాన్యంలో విభేదాలు.. కోర్టుకెక్కిన ప్రీతి జింటా

Preity Zinta Sues Punjab Kings Management Over Disputes
  • సహ డైరెక్టర్లు మోహిత్ బర్మన్, నెస్ వాడియాపై ప్రీతి జింటా ఆరోపణలు
  • ఏప్రిల్ 21న జరిగిన సమావేశం చట్టవిరుద్ధమని వాదన
  • మునీష్ ఖన్నా డైరెక్టర్‌గా నియామకంపై తీవ్ర అభ్యంతరం
  • కంపెనీ నిబంధనలు పాటించలేదని పిటిషన్‌లో పేర్కొన్న ప్రీతి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్టు పంజాబ్ కింగ్స్ సహ యజమాని, బాలీవుడ్ ప్రముఖ నటి ప్రీతి జింటా తన జట్టు యాజమాన్య సంస్థలోని ఇతర డైరెక్టర్లపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు. కేపీహెచ్ డ్రీమ్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ (పంజాబ్ కింగ్స్ జట్టు యాజమాన్య సంస్థ) సహ డైరెక్టర్లు మోహిత్ బర్మన్, నెస్ వాడియాలకు వ్యతిరేకంగా ఆమె చండీగఢ్ కోర్టులో దావా వేశారు. ఏప్రిల్ 21న జరిగిన అసాధారణ సర్వసభ్య సమావేశం (ఈజీఎం) చట్టబద్ధతను, ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆమె సవాలు చేశారు.

ఏప్రిల్ 21న జరిగిన ఈజీఎంలో మునీష్ ఖన్నాను కొత్త డైరెక్టర్‌గా నియమించారు. అయితే, ఈ సమావేశ నిర్వహణలో కంపెనీల చట్టం, 2013లోని నిబంధనలను, ఇతర సెక్రటేరియల్ నియమాలను పాటించలేదని ప్రీతి జింటా తన పిటిషన్‌లో ఆరోపించారు. ఈ సమావేశం గురించి తనకు ఏప్రిల్ 10న ఈమెయిల్ ద్వారా సమాచారం అందినప్పటికీ, తాను లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోలేదని ఆమె పేర్కొన్నారు.

వివాదాస్పద సమావేశానికి ప్రీతి జింటాతో పాటు మరో డైరెక్టర్ కరణ్ పాల్ కూడా హాజరయ్యారు. వీరిద్దరూ మునీష్ ఖన్నా నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. అయినప్పటికీ మోహిత్ బర్మన్, నెస్ వాడియా మద్దతుతో సమావేశాన్ని కొనసాగించి, ఖన్నా నియామకాన్ని ఖరారు చేశారని ప్రీతి తన ఫిర్యాదులో తెలిపారు.

ఈ నేపథ్యంలో ఏప్రిల్ 21న జరిగిన సమావేశాన్ని, అందులో తీసుకున్న నిర్ణయాలను రద్దు చేయాలని ప్రీతి జింటా కోర్టును అభ్యర్థించారు. మునీష్ ఖన్నా డైరెక్టర్‌గా వ్యవహరించకుండా నిరోధించాలని కూడా ఆమె కోరారు. అంతేకాకుండా, ఈ కేసు పరిష్కారమయ్యే వరకు తాను, కరణ్ పాల్ హాజరు లేకుండా, మునీష్ ఖన్నా ప్రమేయం లేకుండా కంపెనీ ఎలాంటి బోర్డు లేదా సర్వసభ్య సమావేశాలు నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామం ఐపీఎల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Preity Zinta
Punjab Kings
IPL
Mohit Burman
Ness Wadia
KPH Dream Cricket Private Limited
Munish Khanna
Chandigarh Court
Indian Premier League
Team Management Dispute

More Telugu News