యువ ఆటగాళ్లకు కీలక సూచనలు చేసిన ధోనీ

  • అంచనాల ఒత్తిడిని తట్టుకోవాలని ధోనీ సూచన
  • 200 ప్లస్ స్ట్రైక్‌రేట్‌తో నిలకడ కష్షమైనా మీ సత్తా గొప్పదని ప్రశంస
  • రాజస్థాన్‌తో మ్యాచ్ ఓటమి అనంతరం యువ ఆటగాళ్లతో ధోనీ మాటామంతీ
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో రాజస్థాన్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ యువ క్రికెటర్లతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా వారికి పలు విలువైన సలహాలు, సూచనలు అందజేశారు.

యువ ఆటగాళ్లను ఉద్దేశించి ధోనీ మాట్లాడుతూ, "మీ మీద అంచనాలు పెరిగినప్పుడు ఒత్తిడికి గురికావొద్దు. సీనియర్‌ ఆటగాళ్లు, కోచింగ్‌ సిబ్బంది నుంచి నేర్చుకోండి. యువ ఆటగాళ్లు 200 ప్లస్‌ స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేయాలనుకున్నప్పుడు, బ్యాటింగ్‌లో నిలకడ కొనసాగించడం కష్టమే. అయినా మ్యాచ్‌లో ఏ దశలో అయినా సిక్స్‌లు కొట్టగల సామర్థ్యం వారి సొంతం" అని అన్నారు. అంచనాల భారాన్ని మోయకుండా సహజసిద్ధమైన ఆటతీరును ప్రదర్శించాలని యువకులకు సూచించారు.

ఇదే క్రమంలో తమ జట్టు ప్రదర్శనపైనా ధోనీ స్పందించారు. "మేం ప్రత్యర్థి జట్టు ముందు మంచి లక్ష్యమే ఉంచాం. కానీ మ్యాచ్‌ ఆరంభంలో త్వరత్వరగా వికెట్లు కోల్పోవడంతో లోయర్‌, మిడిల్‌ ఆర్డర్‌పై ఒత్తిడి పడింది. బ్రెవిస్‌ చక్కటి ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడు బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు రన్‌రేట్‌ చక్కగా ఉంది. కానీ మేం మొదట్లోనే వికెట్లు కోల్పోవడంతో దాన్ని కొనసాగించలేకపోయాం" అని ధోనీ వివరించారు.

అలాగే, పేసర్‌ కాంబోజ్‌ బౌలింగ్‌ను ప్రశంసిస్తూ, "కాంబోజ్‌ చక్కగా బౌలింగ్‌ చేశాడు. మనం ఊహించిన దానికంటే అతడి బంతులు మనల్ని వేగంగా తాకుతాయి. పవర్‌ప్లేలో మూడు ఓవర్లు బౌలింగ్‌ చేయడమంటే అంత తేలిక కాదు. కానీ కాంబోజ్‌ బాగా బౌలింగ్‌ చేశాడు" అని ధోనీ కొనియాడారు.

కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. అనంతరం, రాజస్థాన్‌ రాయల్స్‌ 17.1 ఓవర్లలోనే కేవలం 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.



More Telugu News