Ranya Rao: కన్నడ నటి రన్యా రావు, తరుణ్‌లకు బెంగళూరు కోర్టులో ఊరట

- బంగారం స్మగ్లింగ్ కేసులో నటి రన్యా రావుకు బెయిల్
- రన్యాతో పాటు తరుణ్ రాజ్ కొండూరుకు కూడా ఊరట
- షరతులతో బెయిల్ మంజూరు చేసిన బెంగళూరు కోర్టు
- డీఆర్ఐ చార్జిషీట్ దాఖలు చేయకపోవడమే కారణం
బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యా రావు, మరో నిందితుడు తరుణ్ రాజ్ కొండూరులకు బెంగళూరులోని ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు నేడు ఊరటనిచ్చింది. ఈ కేసులో వారికి షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ఇద్దరు నిందితులు చెరో రూ. 2 లక్షల చొప్పున వ్యక్తిగత బాండ్ సమర్పించాలని, అలాగే ఇద్దరి చొప్పున పూచీకత్తును కూడా అందించాలని ఆదేశించింది. దీంతో పాటు పలు కీలక షరతులను విధించింది.
అధికారులు విచారణకు పిలిచిన ప్రతిసారీ తప్పనిసరిగా హాజరుకావాలని, సాక్ష్యాధారాలను తారుమారు చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయరాదని స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారులకు అన్ని విధాలా సహకరించాలని, కోర్టు నుంచి ముందస్తు అనుమతి పొందకుండా దేశం విడిచి వెళ్లరాదని కూడా నిర్దేశించింది. భవిష్యత్తులో ఇలాంటి నేర కార్యకలాపాల్లో పాలుపంచుకోవద్దని, ఒకవేళ ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేస్తామని హెచ్చరించింది.
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఈ కేసులో నిర్దేశిత 60 రోజుల గడువులోగా ఛార్జిషీట్‌ను దాఖలు చేయడంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో రన్యా రావు, తరుణ్ రాజ్ బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారి బెయిల్ పిటిషన్లపై విచారణ చేపట్టిన కోర్టు, పై షరతులతో బెయిల్‌ను మంజూరు చేసింది.
కాగా, మార్చి 3వ తేదీన రన్యా రావును బంగారం స్మగ్లింగ్ కేసులో డీఆర్ఐ అధికారులు అరెస్టు చేసిన విషయం విదితమే. విమానాశ్రయంలో ఆమెను అదుపులోకి తీసుకున్న సమయంలో, సుమారు రూ. 12.56 కోట్ల విలువ చేసే 14.2 కిలోల విదేశీ బంగారు కడ్డీలను తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. ఇదే కేసులో తరుణ్ రాజ్‌తో పాటు సాహిల్ సకారియా జైన్‌ను కూడా అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఈ ముగ్గురూ బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీలుగా ఉన్నారు.