Jyoti Malhotra: భారత కీలక సమాచారం కోసం.. జ్యోతి మల్హోత్రా, ఐఎస్ఐ హ్యాండ్లర్ అలీ హసన్ మధ్య సంభాషణ!

Jyoti Malhotra ISI handler Ali Hasan conversation leaked
  • పాక్ ఐఎస్‌ఐ కోసం యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గూఢచర్యం
  • భారత అండర్‌కవర్‌ ఏజెంట్లను గుర్తించేందుకు వినియోగం
  • ఐఎస్‌ఐ హ్యాండ్లర్‌తో కోడ్ భాషలో వాట్సప్ చాటింగ్
  • అటారీ సరిహద్దు ఏజెంట్లపై ఐఎస్‌ఐ హ్యాండ్లర్ ఆరా
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసిందన్న ఆరోపణలతో అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. భారత అండర్‌కవర్‌ ఏజెంట్లను గుర్తించేందుకు పాకిస్థాన్ గూఢచార సంస్థ 'ఐఎస్‌ఐ' ఆమెను వాడుకున్నట్లు సమాచారం బయటకు వచ్చింది. ఈ వ్యవహారంలో ఐఎస్‌ఐ హ్యాండ్లర్లతో జ్యోతి కోడ్ భాషలో సంభాషణలు జరిపినట్లు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి.

జ్యోతి మల్హోత్రా, అలీ హసన్‌ అనే ఐఎస్‌ఐ హ్యాండ్లర్‌తో వాట్సప్‌లో చాటింగ్ చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. భారత అండర్‌కవర్‌ ఆపరేషన్లకు సంబంధించిన విషయాలను వీరిద్దరూ కోడ్ భాషలో చర్చించుకున్నట్లు సమాచారం. ఒక సందర్భంలో, "అటారీ సరిహద్దు వద్ద ఎవరైనా అండర్‌కవర్‌ ఏజెంట్లను గుర్తించావా?" అని హసన్‌ ఆమెను అడిగినట్లు దర్యాప్తు అధికారులు నిర్ధారించినట్లు తెలుస్తోంది. వీరి చాటింగ్‌లో వాడిన 'ప్రోటోకాల్', 'అండర్‌కవర్‌' వంటి పదాలను బట్టి, భారత నిఘా సమాచారాన్ని దొంగిలించేందుకు ఐఎస్‌ఐ జ్యోతిని ఉపయోగించుకుందన్న అనుమానాలు బలపడుతున్నాయి.

జ్యోతి మల్హోత్రా-అలీ హాసన్ మధ్య సంభాషణ

హసన్‌: నువ్వు అటారీ వద్ద ఉన్నప్పుడు ఎవరికైనా ప్రత్యేక ప్రోటోకాల్‌ దొరికినట్లు గమనించావా?
జ్యోతి: లేదు, ఎవరికీ అలాంటి ప్రత్యేక ప్రొటోకాల్‌ కనిపించలేదు.
హసన్‌: ఎవరు ప్రొటోకాల్ ద్వారా వస్తున్నారో జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. అండర్‌కవర్‌ ఏజెంట్లను కనిపెట్టడానికి అదే సరైన మార్గం.
జ్యోతి: వాళ్లేం అంత తెలివి తక్కువ వాళ్లు కాదు.

ఈ కోడ్ భాషలోని సందేశాలను దర్యాప్తు అధికారులు డీక్రిప్ట్ చేసి, వారి సంభాషణల సారాంశాన్ని తెలుసుకున్నారు. ప్రస్తుతం మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. జ్యోతి ఉద్దేశపూర్వకంగానే భారత నిఘా సమాచారాన్ని పాక్ ఐఎస్‌ఐకి అందించాలనుకుందా? లేక ఎవరైనా ఆమెను ప్రలోభపెట్టి, తెలియకుండా ఈ గూఢచర్యంలోకి లాగారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

2023లో వైశాఖి పండుగ సందర్భంగా జ్యోతి తొలిసారి పాకిస్థాన్‌కు వెళ్లింది. ఆ పర్యటనలోనే ఆమెకు పాక్‌ హైకమిషన్‌ అధికారి డానిష్‌తో పరిచయం ఏర్పడినట్లు సమాచారం. అయితే, తొలుత డానిష్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని జ్యోతి బుకాయించినట్లు, ఆ తర్వాత పొంతనలేని సమాధానాలు ఇస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం జ్యోతి మల్హోత్రాను ఎన్‌ఐఏ, ఐబీ అధికారులు సంయుక్తంగా ప్రశ్నిస్తున్నారు.
Jyoti Malhotra
ISI
Pakistan
Spying
Atari Border
Ali Hasan
Undercover Agents
Vaishakhi Festival

More Telugu News