Hyderabad Fire Accident: హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం.. బోయగూడలో రెండంతస్తుల భవనంలో మంటలు

- రెండో అంతస్తులోని చెప్పుల గోదాంలో చెలరేగిన మంటలు
- భయంతో బయటకు పరుగులు తీసిన స్థానికులు
- రెండు ఫైర్ ఇంజన్లతో మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది
హైదరాబాద్ నగరంలో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం కలకలం రేపింది. ఛత్రినాక పోలీసు స్టేషన్ పరిధిలోని బోయగూడలో ఉన్న రెండంతస్తుల భవనంలో మంటలు అంటుకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
వివరాల్లోకి వెళితే, బోయగూడలోని ఒక రెండంతస్తుల భవనం రెండో అంతస్తులో మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వేగంగా వ్యాపించడంతో భవనంలో ఉన్నవారు, చుట్టుపక్కల వారు భయంతో వెంటనే బయటకు పరుగులు తీశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఛత్రినాక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
రెండు ఫైర్ ఇంజన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగిన భవనంలో చెప్పుల గోదాము నడుపుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. రెండు రోజుల క్రితం గుల్జార్ హౌస్ సమీపంలోని ఓ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.