Shehbaz Sharif: మరోసారి గొప్పలు చెప్పుకున్న పాక్ ప్రధాని... ఐఎన్ఎస్ విక్రాంత్ పై దాడి చేశారట!

- ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్ కు బుద్ధి చెప్పిన భారత్
- అబద్ధాలతో పాక్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న ఆ దేశ పీఎం
- పాక్ దాడిలో ఐఎన్ఎస్ విక్రాంత్ కు తీవ్ర నష్టం కలిగిందని వ్యాఖ్య
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' ద్వారా పాకిస్థాన్ కు గట్టి బుద్ధి చెప్పినప్పటికీ, పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మాత్రం తమ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్య ప్రచారాలకు తెరలేపారు. భారత్‌పై విజయం సాధించామంటూ, ముఖ్యంగా భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ధ్వంసం చేశామని ఆయన చెప్పిన మాటలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి.
కరాచీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న షెహబాజ్ షరీఫ్... పాక్ నావికాదళం, వైమానిక దళాలను ప్రశంసిస్తూ గొప్పలు చెప్పుకున్నారు. "భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్థాన్ సరిహద్దులకు సమీపంగా, కేవలం 400 నాటికల్ మైళ్ల దూరంలోకి వచ్చింది. అయితే, మన వైమానిక దళం విక్రాంత్‌పై దాడి చేసి తీవ్ర నష్టం కలిగించింది. మన దెబ్బకు ఐఎన్ఎస్ విక్రాంత్ వెనక్కి భారత్ వైపు పారిపోయింది" అంటూ షెహబాజ్ షరీఫ్ పచ్చి అబద్ధాలు చెప్పారు.