"బియ్యం కొనను" అన్న జపాన్ మంత్రిగారికి భార్య క్లాస్.. క్షమాపణ చెప్పిన మంత్రి

  • జపాన్‌లో బియ్యం ధరల పెరుగుదలపై ప్రజల ఆందోళన
  • "బహుమతుల రూపంలో వస్తాయి, మేం బియ్యం కొనక్కర్లేదన్న వ్యవసాయ మంత్రి
  • మంత్రి వ్యాఖ్యలపై తీవ్ర ప్రజా వ్యతిరేకత, రాజీనామా డిమాండ్లు
  • నోరు జారానంటూ మంత్రి క్షమాపణ, భార్య కూడా మందలించిందని వెల్లడి
జపాన్ మంత్రి టకు ఎటో చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆహార పదార్థాల ధరలు, ముఖ్యంగా బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో, తాము బియ్యం కొనాల్సిన అవసరం లేదని ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.

వివరాల్లోకి వెళితే, ఒక నిధుల సమీకరణ కార్యక్రమంలో మంత్రి టకు ఎటో మాట్లాడుతూ, "మాకు బహుమతులుగా కావాల్సినన్ని బియ్యం వస్తుంటాయి. అందుకే మేం ఎప్పుడూ బియ్యం కొనలేదు" అంటూ వ్యాఖ్యానించారు. దేశంలో నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన వెంటనే రాజీనామా చేయాలంటూ పలువురు డిమాండ్ చేశారు.

తన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో మంత్రి టకు ఎటో విలేకరులతో మాట్లాడారు. ప్రజలను ఉత్సాహపరిచే క్రమంలో తాను అలా నోరు జారి మాట్లాడినందుకు క్షమించాలని కోరారు. "బియ్యం కొనక్కర్లేదని నేను అన్న మాటలకు నా భార్య కూడా ఫోన్ చేసి మందలించింది. మన ఇంట్లో మన ఇద్దరమే కాబట్టి బియ్యం ఉంటున్నాయి. ఒకవేళ ఎప్పుడైనా అయిపోతే బయటకు వెళ్లి కొనుక్కోవాల్సిందే కదా అని చెప్పింది" అంటూ తన భార్య మాటలను కూడా ప్రస్తావించారు. అయితే, రాజీనామా డిమాండ్లపై మాత్రం ఆయన స్పందించలేదు.

జులైలో జపాన్‌లో ఎగువసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. ఒపీనియన్ పోల్స్‌లో కూడా ఆ పార్టీకి ప్రజా మద్దతు కేవలం 27.4 శాతంగానే ఉంది. పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించడంలో ప్రభుత్వ చర్యలపై ప్రతి పది మందిలో తొమ్మిది మంది అసంతృప్తితో ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే ప్రధాన ఆహార ధాన్యాల ధరలు రెట్టింపు అయ్యాయి.

తీవ్రమైన వేడి వాతావరణం వల్ల పంటలు దెబ్బతినడం, దేశంలో పర్యాటకుల తాకిడి పెరిగి డిమాండ్ అధికమవడం వంటివి ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ధరలను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం అత్యవసర నిల్వల నుంచి బియ్యాన్ని మార్కెట్లోకి విడుదల చేస్తున్నప్పటికీ, అది పెద్దగా ప్రయోజనం చూపించడం లేదని సమాచారం.


More Telugu News