టర్కీ, అజర్‌బైజాన్‌లకు షాకిచ్చిన చండీగఢ్ విశ్వవిద్యాలయం

  • చండీగఢ్ యూనివర్సిటీ కీలక నిర్ణయం
  • టర్కీ, అజర్‌బైజాన్‌లతో ఒప్పందాలు రద్దు
  • మొత్తం 23 సహకార భాగస్వామ్యాలకు ముగింపు
  • దేశ గౌరవమే ముఖ్యమన్న సత్నామ్ సింగ్ సంధూ
చండీగఢ్ విశ్వవిద్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. టర్కీ, అజర్‌బైజాన్ దేశాలతో దశాబ్దాలుగా కొనసాగుతున్న విద్యాపరమైన, సాంస్కృతిక ఒప్పందాలను తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దేశ గౌరవాన్ని కాపాడేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని విశ్వవిద్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి.

టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాలకు చెందిన వివిధ సంస్థలతో చండీగఢ్ విశ్వవిద్యాలయానికి ఉన్న మొత్తం 23 అవగాహన ఒప్పందాలను (ఎంఓయూలను) రద్దు చేస్తున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఫ్యాకల్టీ మార్పిడి (అధ్యాపకుల పరస్పర పర్యటనలు) కార్యక్రమాలు కూడా పూర్తిగా నిలిచిపోనున్నాయి.

ఈ విషయాన్ని రాజ్యసభ సభ్యుడు, చండీగఢ్ యూనివర్సిటీ వ్యవస్థాపక ఛాన్సలర్ సత్నామ్ సింగ్ సంధూ స్వయంగా వెల్లడించారు.

ఆయన మాట్లాడుతూ, "దేశ గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని చండీగఢ్ విశ్వవిద్యాలయం ఈ రోజు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి టర్కీ, అజర్‌బైజాన్‌లతో విశ్వవిద్యాలయానికి ఎలాంటి సంబంధాలు ఉండవు. ఆ దేశాలతో ఉన్న 23 సహకార భాగస్వామ్యాలను రద్దు చేశాం. మా ఫ్యాకల్టీ మార్పిడి కార్యక్రమాలను కూడా నిలిపివేశాం" అని ఆయన స్పష్టం చేశారు.

పాకిస్థాన్‌తో భారత్‌కు ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు టర్కీ, అజర్‌బైజాన్ దాయాది దేశానికి మద్దతుగా నిలిచాయి. దీంతో భారత్‌లో బాయ్‌కాట్ టర్కీ, బాయ్‌కాట్ అజర్‌బైజాన్ నినాదం ఊపందుకుంది.


More Telugu News