చిన్నస్వామిలో కోహ్లీకి అపూర్వ నీరాజనం... నెం.18 జెర్సీలతో అభిమానుల కోలాహలం

  • ఇటీవల టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పిన కోహ్లీ 
  • ఇవాళ ఐపీఎల్ రీస్టార్ట్... బెంగళూరులో ఆర్సీబీ × కేకేఆర్
  • మైదానానికి తెల్ల దుస్తుల్లో వచ్చిన ఫ్యాన్స్
భారత క్రికెట్ దిగ్గజం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో, ఆయనకు అపురూపమైన రీతిలో నీరాజనాలు అర్పించేందుకు అభిమానులు ఇవాళ బెంగళూరు చిన్నస్వామి స్టేడియానికి భారీగా తరలివచ్చారు. నేడు (మే 17) చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో (కేకేఆర్) జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మ్యాచ్ సందర్భంగా, అభిమానులంతా నెం.18తో కూడిన తెల్లటి దుస్తులు ధరించి కోహ్లీ టెస్ట్ ప్రస్థానానికి గౌరవ భావం ప్రదర్శించారు.

భారత్-పాకిస్థాన్ సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్‌కు కొంతకాలం అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ విరామ సమయంలోనే, మే 12న విరాట్ కోహ్లీ హఠాత్తుగా టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి యావత్ క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశారు. ఐపీఎల్ తిరిగి ప్రారంభమైన తర్వాత కోహ్లీ ఆడనున్న తొలి మ్యాచ్ ఇదే కావడంతో, ఆయనకు ఘనంగా వీడ్కోలు పలకాలని ఆర్సీబీ ఫ్యాన్స్ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

చిన్నస్వామిలో 'పాలసంద్రం'

కోహ్లీకి నీరాజనంగా రూపొందించిన తెల్లటి జెర్సీలు ఇప్పటికే బెంగళూరు మార్కెట్లలో సందడి చేస్తున్నాయి. వాటిని కొనుగోలు చేసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. స్టేడియాన్ని 'పాలసంద్రం'గా మార్చాలనే పిలుపుతో సోషల్ మీడియాలో #WhiteForKohli, #ThankYouKohli వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో ప్రచారం ఊపందుకుంది. ఓవైపు వర్షం కురుస్తున్నప్పటికీ అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి కోహ్లీకి మద్దతు పలికేందుకు ఉత్సాహం చూపుతున్నారు. టాస్‌కు ముందే వర్షం ప్రారంభమైనా, అభిమానులు మాత్రం స్టాండ్స్‌లోనే ఉండిపోయి తమ అభిమాన ఆటగాడిపై ప్రేమను చాటుకున్నారు.

హర్షా భోగ్లే ప్రశంస, ఆర్సీబీ డైరెక్టర్ స్పందన

ఈ అభిమానుల చొరవపై ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే సోషల్ మీడియాలో స్పందిస్తూ, "మే 17న జరిగే ఆటకు మీరు తెల్లటి దుస్తుల్లో వస్తున్నారా? ఇది నిజమైతే, మీరు దీన్ని విజయవంతం చేయగలిగితే, అది నమ్మశక్యం కాని, చిరస్థాయిగా నిలిచిపోయే దృశ్యం అవుతుంది," అని కొనియాడారు.

అయితే, ప్రేక్షకులంతా తెల్లటి దుస్తులు ధరించడం వల్ల మైదానంలో ఫీల్డర్లకు తెల్ల బంతిని చూడటంలో ఇబ్బందులు తలెత్తవచ్చనే ఆందోళనలు కూడా వ్యక్తమయ్యాయి. టీ20 మ్యాచ్‌లలో ఉపయోగించే తెల్ల బంతిని ట్రాక్ చేయడం కష్టతరంగా మారవచ్చని కొందరు అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్ మాట్లాడుతూ, "మేము దీని గురించి పెద్దగా ఆలోచించలేదు... చర్చించలేదు. అభిమానులు దీని గురించి మాట్లాడుకుంటున్నట్లు నేను గమనించాను, కానీ ఇది మా ఆటపై పెద్దగా ప్రభావం చూపుతుందని నేను అనుకోను" అని ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫోతో అన్నారు.


More Telugu News