Babar Azam: ఈ ఇద్దరు భారత స్టార్లను వదిలేసి వరల్డ్ ఎలెవన్ ను ప్రకటించిన బాబర్ అజామ్

- అత్యుత్తమ టీ20 జట్టు ప్రకటించిన బాబర్ అజామ్
- భారత స్టార్ ఆటగాళ్లు కోహ్లీ, బుమ్రాలకు దక్కని చోటు
- టీమిండియా నుంచి రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌లకు స్థానం
- ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించిన బాబర్
పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ సారథి, స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ తన అత్యుత్తమ టీ20 ప్రపంచ జట్టును ప్రకటించాడు. అయితే, ఈ జట్టులో భారత దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రాలకు చోటు దక్కకపోవడం గమనార్హం. అంతేకాకుండా, బాబర్ అజామ్ తనను కూడా ఈ జట్టులోకి తీసుకోలేదు. అదే సమయంలో, టీమిండియా నుంచి ఇద్దరు కీలక ఆటగాళ్లకు బాబర్ తన జట్టులో స్థానం కల్పించాడు.
ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ బాబర్ ఈ ఆసక్తికర జట్టును వెల్లడించాడు. తన జట్టులో ఓపెనర్‌గా భారత కెప్టెన్ రోహిత్ శర్మను ఎంచుకున్న బాబర్, అతనికి జోడీగా పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌కు అవకాశం ఇచ్చాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగుల వీరుడిగా పేరుపొందిన రోహిత్‌ను తీసుకోవడం విశేషం. ఇక వన్‌డౌన్‌లో పాకిస్థాన్‌కే చెందిన ఫఖర్ జమాన్‌ను ఎంపిక చేయగా, నాలుగో స్థానంలో విధ్వంసకర భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు బాబర్ చోటిచ్చాడు. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్, దక్షిణాఫ్రికా హార్డ్ హిట్టర్ డేవిడ్ మిల్లర్‌లను వరుసగా ఐదు, ఆరు స్థానాలకు ఎంచుకున్నాడు.
ఆల్‌రౌండర్ కోటాలో దక్షిణాఫ్రికా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మార్కో యన్సెన్‌కు ఏడో స్థానం కేటాయించిన బాబర్, ఏకైక స్పిన్నర్‌గా ఆఫ్ఘనిస్థాన్ సంచలనం రషీద్ ఖాన్‌ను తీసుకున్నాడు. ఇక పేస్ దళంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మరో ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్‌లతో పాటు ఇంగ్లండ్ స్పీడ్‌స్టర్ మార్క్‌వుడ్‌లకు స్థానం కల్పించాడు. తన జట్టు పవర్ హిట్టర్లు, వైవిధ్యమైన బౌలర్లతో పటిష్టంగా, సమతూకంగా ఉందని బాబర్ అజామ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.
కాగా, 2024 టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ జట్టు బాబర్ అజామ్ సారథ్యంలో కనీసం గ్రూప్ దశను కూడా దాటలేక నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ పేలవ ప్రదర్శన నేపథ్యంలో, బాబర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి, మహ్మద్ రిజ్వాన్‌కు వన్డే, టీ20 పగ్గాలు అప్పగించారు. అయినప్పటికీ, రిజ్వాన్ నాయకత్వంలోనూ పాకిస్థాన్ జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలలో కొన్ని వన్డే విజయాలు మినహా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో కూడా రిజ్వాన్ బృందం ఒక్క విజయం సాధించకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
బాబర్ ఆజామ్ వరల్డ్ ఎలెవన్ ఇదే..
రోహిత్ శర్మ, మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, సూర్యకుమార్ యాదవ్, జోస్ బట్లర్, డేవిడ్ మిల్లర్, మార్కో యాన్సెన్, రషీద్ ఖాన్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, మార్క్‌వుడ్.