Turkey: టర్కీకి భారత్ డెస్టినేషన్ వెడ్డింగ్ షాక్.. రూ. 770 కోట్ల మేర దెబ్బ

India Deals a Rs 770 Crore Blow to Turkeys Destination Wedding Market
  • పాకిస్థాన్‌కు టర్కీ మద్దతుతో భారతీయుల ఆగ్రహం
  • టర్కీలో భారతీయ వివాహ వేడుకలు తగ్గుముఖం
  • సుమారు 90 మిలియన్ డాలర్ల ఆదాయం కోల్పోనున్న టర్కీ
  • 'బాయ్‌కాట్ టర్కీ' నినాదంతో వెనక్కి తగ్గుతున్న పర్యాటకులు
  • వ్యాపార, వాణిజ్య సంబంధాలపైనా ప్రభావం
పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న టర్కీకి భారత్ నుంచి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయులు 'బాయ్‌కాట్ టర్కీ' నిరసన చేపట్టారు. ఈ ప్రభావం టర్కీ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా 'డెస్టినేషన్ వెడ్డింగ్స్' ద్వారా ఆ దేశం ఆర్జించే ఆదాయంపై తీవ్రంగా పడనుంది. ఈ పరిణామాల వల్ల టర్కీ దాదాపు 90 మిలియన్ డాలర్లకు పైగా ఆదాయాన్ని నష్టపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

గత కొంతకాలంగా విదేశాల్లో వివాహాలు చేసుకోవాలనుకునే భారతీయ సంపన్నులకు టర్కీ ఒక ప్రధాన ఆకర్షణగా మారింది. అక్కడి ఇస్తాంబుల్‌లోని చారిత్రక రాజభవనాలు, అందమైన సముద్ర తీర ప్రాంతాలు నూతన వధూవరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో 2018లో కేవలం 13 భారతీయ జంటలు టర్కీలో పెళ్లి చేసుకోగా, గత ఏడాది నాటికి ఈ సంఖ్య ఏకంగా 50కి చేరింది.

ప్రముఖ వెడ్డింగ్ ప్లానింగ్ సంస్థ కెస్టోన్ ఉత్సవ్ సీనియర్ ప్రతినిధి నిఖిల్ మహాజన్ మాట్లాడుతూ "భారత్ నుంచి డెస్టినేషన్ వెడ్డింగ్‌ల కోసం టర్కీకి వెళ్లే వారి ద్వారా ఆ దేశ పర్యాటక రంగానికి ఏటా సగటున 140 మిలియన్ డాలర్ల ఆదాయం లభిస్తోంది" అని తెలిపారు.

సాధారణంగా ఒక్కో వివాహానికి సగటున 3 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 25 కోట్లు) వరకు ఖర్చవుతుందని, కొన్ని సందర్భాల్లో ఇది 8 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 68 కోట్లు) వరకు కూడా ఉంటుందని అక్కడి గణాంకాలు తెలియజేస్తున్నాయి. పెళ్లికి హాజరయ్యే అతిథులు స్థానికంగా పర్యటించడం వల్ల కూడా టర్కీకి అదనపు ఆదాయం సమకూరుతోంది.

అయితే సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు 'ఆపరేషన్ సిందూర్‌' సమయంలో టర్కీ బహిరంగంగా మద్దతు ప్రకటించడం భారతీయుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. దీంతో దేశవ్యాప్తంగా 'బాయ్‌కాట్ టర్కీ' నినాదం ఊపందుకుంది. ఇప్పటికే దాదాపు 2,000 మంది భారతీయ పర్యాటకులు తమ టర్కీ పర్యటనలను రద్దు చేసుకున్నారు. ఈ ఏడాది టర్కీలో వివాహం చేసుకోవడానికి సుమారు 30 భారతీయ జంటలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. కానీ ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో వీరంతా ప్రత్యామ్నాయ వివాహ వేదికలను ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనివల్ల టర్కీ సుమారు 90 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 770 కోట్లు) ఆదాయాన్ని కోల్పోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ నిరసన పర్యాటకం, వివాహాలకే పరిమితం కాలేదు. టర్కీతో వ్యాపార సంబంధాలను కూడా భారతీయులు క్రమంగా తగ్గించుకుంటున్నారు. పండ్లు, ఆభరణాల వ్యాపారులు టర్కీ నుంచి దిగుమతులను నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (కెయిట్) కూడా టర్కీ కంపెనీలతో ఎలాంటి వ్యాపార సంబంధాలు పెట్టుకోవద్దని పిలుపునిచ్చింది.
Turkey
India
Boycott Turkey
Destination Weddings
Turkey Tourism
India-Turkey Relations

More Telugu News