Payyavula Keshav: మన త్రివిధ దళాల శక్తి ప్రపంచానికి తెలిసింది: పయ్యావుల కేశవ్

Indias Military Strength Shown to the World Payyavula Keshav
  • అనంతపురం, గుంటూరుల్లో తిరంగా ర్యాలీలు
  • ఉగ్రవాద కుట్రలు దేశాభివృద్ధిని అడ్డుకోలేవన్న పయ్యావుల
  • మురళీనాయక్ త్యాగాన్ని కొనియాడిన పెమ్మసాని చంద్రశేఖర్
ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన నేపథ్యంలో, దేశ సైనికులకు కృతజ్ఞతలు తెలుపుతూ అనంతపురం, గుంటూరు జిల్లాల్లో భారీ తిరంగా ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండాలు చేతబూని, సైనికులకు సంఘీభావం ప్రకటించారు.

అనంతపురంలో ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు జరిగిన ర్యాలీలో మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్ ద్వారా మన త్రివిధ దళాల సత్తా ప్రపంచానికి తెలిసిందన్నారు. ఉగ్రవాద కుట్రలు దేశాభివృద్ధిని అడ్డుకోలేవని స్పష్టం చేశారు. మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ నాయకత్వంలో మన సైనిక శక్తి దేశానికి తెలిసిందని, అమాయకుల ప్రాణాలు తీస్తే మన సైన్యం ఉగ్రవాద శిబిరాలపైనే దాడి చేసిందన్నారు.

గుంటూరులో జరిగిన తిరంగా ర్యాలీలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, రామాంజనేయులు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. పహల్గామ్ లో ఉగ్రదాడిని ఖండించిన పెమ్మసాని... ఆపరేషన్ సిందూర్ తో ఉగ్రవాదులను అంతం చేశామని చెప్పారు. ఆపరేషన్‌లో పాల్గొన్న సైన్యానికి అభినందనలు తెలిపి, దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీనాయక్ త్యాగాన్ని కొనియాడారు. ఎన్డీఏ ప్రభుత్వానికి దేశ రక్షణే మొదటి ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు.
Payyavula Keshav
Operation Sindhur
Indian Armed Forces
Anantapur
Guntur
Tiranga Rallies
National Flag
Anti-Terrorism
Satyakumar
Pemmasani Chandrasekhar

More Telugu News