Salman Rushdie: సల్మాన్ రష్దీపై దాడి కేసు నిందితుడికి పాతికేళ్ల జైలు శిక్ష

Salman Rushdie Attacker Sentenced to 25 Years in Jail
  • న్యూయార్క్‌లో 2022లో అంతర్జాతీయ రచయిత సల్మాన్ రష్దీ‌పై హత్యాయత్నం
  • న్యూజెర్సీకి చెందిన హాది మతార్‌ను ఇప్పటికే దోషిగా తేల్చిన న్యాయస్థానం
  • తాజాగా శిక్ష ఖరారు చేసిన న్యాయస్థానం
అంతర్జాతీయ రచయిత, బుకర్ ప్రైజ్ విజేత సల్మాన్ రష్దీపై జరిగిన హత్యాయత్నం కేసులో న్యూయార్క్‌లోని న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఇదివరకే న్యూజెర్సీకి చెందిన హాది మతార్‌ను దోషిగా ప్రకటించిన న్యాయస్థానం తాజాగా శిక్ష ఖరారు చేసింది. నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.

కేసు పూర్వాపరాల విషయానికి వస్తే, 2022లో అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని చౌతాక్వా ప్రాంతంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సల్మాన్ రష్దీ ప్రసంగించేందుకు ఉపక్రమిస్తుండగా, ఓ దుండగుడు వేదికపైకి దూసుకువచ్చి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రష్దీ ఒక కంటి చూపును కోల్పోయారు.

సల్మాన్ రష్దీ 1947లో ముంబయిలో జన్మించగా, కొంతకాలానికి బ్రిటన్ తరలివెళ్లారు. రష్దీ రచించిన మిడ్ నైట్ చిల్డ్రన్ నవలకు 1981లో ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ దక్కడంతో ఆయన ప్రాచుర్యం పొందారు. అయితే ఆయన రచించిన పలు నవలలు వివాదాస్పదమయ్యాయి. ప్రధానంగా 1988లో రచించిన ది సాతానిక్ వెర్సెస్ నవల తీవ్ర వివాదాస్పదమైంది.

ఈ క్రమంలో ఆయనకు అనేక బెదిరింపులు కూడా వచ్చాయి. మతాన్ని కించపరిచేలా ఉందంటూ 1988 నుంచి ఇరాన్‌లో ఈ నవలను నిషేధించారు. అప్పటి సుప్రీంలీడర్ అయతొల్లా రుహోల్లా ఖమేనీ రష్దీపై ఫత్వా కూడా జారీ చేశారు. ఫత్వా జారీ చేసిన 33 ఏళ్ల తర్వాత ఆయనపై దాడి జరిగింది. 
Salman Rushdie
Hadi Matar
Assault
Attack
The Satanic Verses
Fatwa
Booker Prize
New York
Jail Sentence
Literary Figure

More Telugu News