Luxury Car Dealer: రూ. 100 కోట్ల కస్టమ్స్ డ్యూటీ స్కామ్‌... హైదరాబాదీ లగ్జరీ కార్ డీలర్ అరెస్ట్‌!

Rs 100 Crore Customs Duty Scam Hyderabad Luxury Car Dealer Arrested
  • హైదార‌బాద్‌లో 'కార్ లాంజ్' పేరుతో కార్ల‌ షోరూమ్ న‌డిపిస్తున్న బ‌ష‌ర‌త్ ఖాన్
  • అధిక కస్టమ్స్ సుంకాలను తప్పించుకోవడానికి అడ్డ‌దారులు 
  • నకిలీ పత్రాలు, తక్కువ విలువ కలిగిన ఇన్‌వాయిస్‌లను ఉపయోగించిన వైనం
  • అమెరికా, జపాన్ నుంచి హై-ఎండ్ కార్ల దిగుమతి
హై-ఎండ్ వాహనాల విలువను తక్కువగా చూపించి దాదాపు రూ.100 కోట్ల కస్టమ్స్ సుంకాలను ఎగవేసినందుకు హైదరాబాద్ లగ్జరీ కార్ల డీలర్ బషరత్ ఖాన్ గుజరాత్‌లో అరెస్టు అయ్యాడు. అతను అమెరికా, జపాన్ నుంచి హై-ఎండ్ కార్లను దిగుమతి చేసుకోవడానికి నకిలీ పత్రాలు సృష్టించిన‌ట్లు అధికారుల విచార‌ణ‌లో తేలింది. 

డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) ప్రకారం, హైదార‌బాద్‌లో 'కార్ లాంజ్' పేరుతో కార్ల‌ షోరూమ్ న‌డిపిస్తున్న బ‌ష‌ర‌త్ ఖాన్ అధిక కస్టమ్స్ సుంకాలను తప్పించుకోవడానికి నకిలీ పత్రాలు, తక్కువ విలువ కలిగిన ఇన్‌వాయిస్‌లను ఉపయోగించిన‌ట్లు అధికారులు తెలిపారు.

ప్రాథమిక దర్యాప్తులో ఈ లగ్జరీ వాహనాలను అమెరికా, జపాన్ వంటి దేశాల నుంచి తీసుకువచ్చినట్లు తేలింది. వాటిని దుబాయ్ లేదా శ్రీలంకకు తీసుకెళ్లి అక్కడ వాటి ఎడమవైపు డ్రైవ్ సిస్ట‌మ్‌ను కుడివైపు డ్రైవ్‌కు మార్చారు. ఆ తర్వాత నకిలీ పత్రాలను ఉపయోగించి వాహనాలను ఇండియాలోకి దిగుమతి చేసుకున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

ఇలా ఇప్పటివరకు కనీసం 30 హై-ఎండ్ వాహనాలను అక్రమంగా దిగుమతి చేసుకున్నట్లు గుర్తించారు. వీటిలో హమ్మర్ ఈవీ, కాడిలాక్ ఎస్కలేడ్, రోల్స్ రాయిస్, లెక్సస్, టయోటా ల్యాండ్ క్రూయిజర్, లింకన్ నావిగేటర్ వంటి ల‌గ్జ‌రీ మోడళ్లు ఉన్నాయి.

గత 10 సంవత్సరాలుగా హైదరాబాద్‌లో లగ్జరీ కార్ల షోరూమ్‌ను నడుపుతున్న బ‌ష‌ర‌త్ ఖాన్ ఒక్కడే అలాంటి ఎనిమిది వాహనాలను దిగుమతి చేసుకున్నాడని, దీని వల్ల రూ. 7 కోట్లకు పైగా కస్టమ్స్ సుంకం ఎగవేత‌కు పాల్పడ్డాడని అధికారులు ఆరోపించారు. 

ఖాన్ కు అతని వ్యాపార భాగస్వామి డాక్టర్ అహ్మద్ సహాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. అతను తన ఫామ్ హౌస్ లో ఇలా అక్ర‌మంగా దిగుమతి చేసుకున్న లగ్జరీ వాహనాలను ఉంచేవాడ‌ని తెలిసింది. ఇక‌, బ‌ష‌ర‌త్ ఖాన్ వ‌ద్ద కార్లు కొనుగోలు చేసిన క‌స్టమర్లలో చాలామంది పన్నులను ఎగవేసేందుకు అత‌నికి నగదు రూపంలో చెల్లింపులు చేసిన‌ట్లు తెలుస్తోంది.

ఈ దిగుమతి నెట్‌వర్క్ హైదరాబాద్, ముంబ‌యి, పూణే, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీ అంతటా విస్తరించి ఉందని అధికారులు తెలిపారు. ప్ర‌స్తుతం ఖాన్‌ను జ్యుడీషియల్ కస్టడీకి తరలించిన అధికారులు, తదుపరి దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.
Luxury Car Dealer
Basarath Khan
Customs Duty Scam
Hyderabad
DRI
India
Luxury Cars
Smuggling
Car Import
Tax Evasion

More Telugu News