K. Anand Rao: లంచం కేసులో బెయిల్.. అక్రమార్జన కేసులో మర్నాడే కాకినాడ రిజిస్ట్రార్ అరెస్ట్

Kakinada Registrar Arrested Again in Disproportionate Assets Case

  • ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ చర్యలు
  • లక్ష రూపాయల లంచం కేసులో మార్చిలో అరెస్ట్
  • బెయిల్‌పై విడుదలైన మర్నాడే మళ్లీ అరదండాలు
  • ఆంధ్ర, తెలంగాణలోని ఇళ్లలో ఏసీబీ దాడులు
  • రాజమహేంద్రవరం జైలుకు తరలింపు

లంచం తీసుకుంటూ ఇప్పటికే ఒకసారి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కి సస్పెన్షన్‌కు గురైన కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కె. ఆనందరావు మెడకు మరో ఉచ్చు బిగిసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఆయన్ను నిన్న (గురువారం) మళ్లీ అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.

వివరాల్లోకి వెళితే.. తునికి చెందిన ఓ వ్యక్తి నుంచి గ్యాస్ ఏజెన్సీ లైసెన్స్ పేరు మార్పిడి చేసేందుకు రూ.లక్ష లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై ఈ ఏడాది మార్చి 28న ఆనందరావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆ కేసు రిమాండ్‌లో భాగంగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న ఆయన ఈ నెల 14న బెయిల్‌పై విడుదలయ్యారు.

అయితే, లంచం కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఆనందరావు అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడతో పాటు తెలంగాణలోని నిజామాబాద్, బోధన్, హైదరాబాద్‌లోని వనస్థలిపురం ప్రాంతాల్లో ఉన్న ఆనందరావు, ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల నివాసాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

ఈ సోదాల్లో లభించిన ఆధారాల మేరకు గురువారం ఆనందరావును ఏసీబీ అధికారులు మళ్లీ అరెస్టు చేసి రాజమహేంద్రవరం ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆయనకు రిమాండ్ విధించడంతో తిరిగి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు.

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన కె. ఆనందరావు 1995లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలో స్టెనోగ్రాఫర్‌గా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2001లో సబ్-రిజిస్ట్రార్‌గా పదోన్నతి పొంది పలు ప్రాంతాల్లో సేవలందించారు. 2016 నుంచి జిల్లా రిజిస్ట్రార్‌ హోదాలో విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరంలలో పనిచేశారు. కాకినాడ జిల్లా రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలోనే ఆయనపై పలు ఆరోపణలు, ఫిర్యాదులు అందడంతో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టి అరెస్టు చేశారు.

K. Anand Rao
Kakinada Registrar
ACB Arrest
Bribery Case
Disproportionate Assets
Andhra Pradesh ACB
Rajamahendravaram
Anti Corruption Bureau
Telangana
Illegal Assets
  • Loading...

More Telugu News