కేపీహెచ్‌బీలో నగల వ్యాపారి ఘరానా మోసం.. కిలో బంగారం, కోట్ల నగదుతో పరారీ!

  • ప్రగతినగర్ ‘చేతన్ జువెల్లర్స్’ యజమాని నితీశ్ జైన్ మోసం
  • నెలవారీ స్కీంలు, కొత్త నగల పేరుతో కోట్ల వసూళ్లు
  • వారం రోజులుగా దుకాణం మూసివేత, ఫోన్ స్విచ్ఛాఫ్
  • హోల్‌సేల్‌గా 860 గ్రాముల బంగారం తీసుకుని మరో షాపునకు ఎగనామం
  •  బాచుపల్లి, కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్లలో బాధితుల ఫిర్యాదులు
  •  భార్యతో కలిసి నితీశ్ పరారైనట్టు అనుమానం
హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ ప్రగతినగర్‌లో నగల దుకాణం నిర్వహిస్తున్న ఓ వ్యాపారి వినియోగదారులను, ఇతర వ్యాపారులను నమ్మించి కోట్ల రూపాయల విలువైన నగదు, బంగారంతో ఉడాయించిన ఘటన కలకలం రేపింది. నెలవారీ స్కీముల పేరుతో సామాన్యుల నుంచి డబ్బులు వసూలు చేయడమే కాకుండా, హోల్‌సేల్ వ్యాపారుల నుంచి భారీగా బంగారం తీసుకుని బోర్డు తిప్పేశాడు. బాధితులు పెద్ద సంఖ్యలో పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

ప్రగతినగర్‌లోని నెమలి బొమ్మల చౌరస్తాలో నితీశ్ జైన్ ‘చేతన్ జువెల్లర్స్’ పేరుతో నగల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆకర్షణీయమైన నెలవారీ బంగారు ఆభరణాల స్కీములు ప్రవేశపెట్టి, అనేక మంది  నుంచి డబ్బులు వసూలు చేశాడు. మరికొందరు కొత్త నగల కోసం అడ్వాన్సుగా పెద్ద మొత్తంలో నగదు చెల్లించారు. ఇంకొందరి దగ్గర వ్యక్తిగత అవసరాల పేరుతో అప్పులు కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది.

గత వారం రోజులుగా చేతన్ జువెల్లర్స్ దుకాణం మూసి ఉండటం, యజమాని నితీశ్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో అనుమానం వచ్చిన బాధితులు గురువారం బాచుపల్లి పోలీసులను ఆశ్రయించారు. తమకు జరిగిన మోసాన్ని వివరిస్తూ ఫిర్యాదు చేశారు. ఈ విషయమై బాచుపల్లి సీఐ ఉపేందర్ యాదవ్ మాట్లాడుతూ బాధితుల ఫిర్యాదు మేరకు నితీశ్ జైన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ఇదే సమయంలో కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ నితీశ్‌పై మరో మోసం కేసు నమోదైంది. కేపీహెచ్‌బీ రెండో రోడ్డులో నగల దుకాణం నడుపుతున్న రాజస్థాన్‌కు చెందిన సుభాష్ జైన్, అశోక్‌కుమార్ జైన్ అనే సోదరుల నుంచి నితీశ్ హోల్‌సేల్ ధరలకు బంగారు ఆభరణాలు తీసుకునేవాడు. ఆభరణాలు అమ్మిన తర్వాత డబ్బు చెల్లించే పద్ధతిలో వీరి మధ్య వ్యాపారం సాగుతోంది. ఈ క్రమంలో సుమారు 860 గ్రాముల బంగారు ఆభరణాలను నితీశ్ జైన్ తీసుకున్నాడు. అయితే, వాటికి సంబంధించిన డబ్బులు చెల్లించకుండా గత కొంతకాలంగా కాలయాపన చేస్తూ వస్తున్నాడు.

అనుమానం వచ్చి విచారించగా నితీశ్ తన భార్యతో కలిసి పరారైనట్లు సుభాష్ జైన్, అశోక్‌కుమార్ జైన్‌లకు తెలిసింది. దీంతో వారు గురువారం కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ రెండు కేసులను తీవ్రంగా పరిగణించి, నిందితుడు నితీశ్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.  


More Telugu News