రేషన్ వ్యవస్థ బలోపేతానికి అందరం కలిసి పని చేద్దాం: మంత్రి నాదెండ్ల

  • ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతంపై మంత్రి నాదెండ్ల సమీక్ష
  • విజయవాడలో డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లతో సమావేశం
  • ప్రతి కుటుంబానికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
  • రూ.46.10 ఖర్చుతో బియ్యం కొని పేదలకు పంపిణీ
  • అందరి సహకారంతో పీడీఎస్‌ను మరింత పటిష్టం చేస్తామని వెల్లడి
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు చేర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)ను మరింత బలోపేతం చేసేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ కానూరులోని సివిల్ సప్లైస్ భవన్‌లో చౌక దుకాణాల అసోసియేషన్ ప్రతినిధులు, మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ) ఆపరేటర్లతో నేడు మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని అనేక పల్లెలు, గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలలో ప్రభుత్వం అందించే రేషన్ బియ్యం కోసం పేద ప్రజలు ఇప్పటికీ ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ నిత్యావసరాలు సక్రమంగా అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు.

పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం కిలో బియ్యాన్ని రూ. 46.10 పైసలు వెచ్చించి కొనుగోలు చేసి, లబ్ధిదారులకు అందిస్తోందని మంత్రి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 29 వేల చౌక దుకాణాల ద్వారా నెలకు 2 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల బియ్యం, 6,500 మెట్రిక్ టన్నుల పంచదారతో పాటు ఇతర నిత్యావసర వస్తువులను ప్రజలకు చేరవేస్తున్నట్లు తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టం చేసి, పారదర్శకంగా నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సహకారంతో ముందుకు సాగుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ వ్యవస్థలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు.

ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మన్వీర్ జిలాని, వివిధ జిల్లాల నుంచి వచ్చిన చౌక దుకాణాల సంఘం ప్రతినిధులు, ఎండీయూ ఆపరేటర్లు పాల్గొన్నారు. వారు తమ సమస్యలను, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.


More Telugu News