Supreme Court: కంచ గ‌చ్చిబౌలి భూముల వ్య‌వ‌హారం.. ప్ర‌భుత్వాధికారుల‌పై సుప్రీంకోర్టు సీరియ‌స్

Supreme Court Serious on Kancha Gachibowli Land Scam
  • విచార‌ణ సందర్భంగా సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు
  • ప‌ర్యావ‌ర‌ణ‌ న‌ష్టాన్ని పూడ్చేందుకు తీసుకునే చ‌ర్య‌ల‌ను స్ప‌ష్టంగా చెప్పాల‌న్న‌ న్యాయ‌స్థానం
  • న‌ష్టాన్ని పూడ్చే చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోతే సీఎస్ స‌హా కార్య‌ద‌ర్శులు జైలుకు పోవాల్సి ఉంటుంద‌న్న‌ ధ‌ర్మాస‌నం
హైదరాబాద్‌ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. విచార‌ణ సందర్భంగా సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప‌ర్యావ‌ర‌ణ అనుమతులు తీసుకున్నారా? లేదా? చెప్పాలని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ప్రశ్నించారు. 

లాంగ్ వీకెండ్ చూసి ఎందుకు చ‌ర్య‌లు మొద‌లు పెట్టార‌ని ధ‌ర్మాస‌నం మ‌రోసారి ప్ర‌శ్నించింది. న‌ష్టాన్ని పూడ్చేందుకు తీసుకునే చ‌ర్య‌ల‌ను స్ప‌ష్టంగా చెప్పాల‌ని న్యాయ‌స్థానం పేర్కొంది. ఈ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు ఏమాత్రం విరుద్ధంగా వ్యవహరించినా ఊరుకునేది లేదని ధర్మాసనం హెచ్చరించింది. 

అలాగే ప‌ర్యావ‌ర‌ణానికి జ‌రిగే న‌ష్టాన్ని పూడ్చే చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోతే సీఎస్ స‌హా కార్య‌ద‌ర్శులు జైలుకు పోవాల్సి ఉంటుంద‌ని ధ‌ర్మాస‌నం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇక‌, కేంద్ర సాధికారిక సంస్థ దాఖ‌లు చేసిన నివేదిక‌పై కౌంట‌ర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పు న్యాయ‌వాది స‌మ‌యం కోరారు. 

ఈ సంద‌ర్భంగా విజిల్ బ్లోయ‌ర్స్, విద్యార్థుల‌పై న‌మోదైన కేసుల విష‌యాన్ని పలువురు న్యాయ‌వాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ కేసులు కొట్టివేయాల‌ని అప్లికేష‌న్ దాఖ‌లు చేసిన‌ట్లు తెల‌ప‌గా... ఈ పిటిష‌న్‌తో క‌లిపి విచారించ‌డం కుద‌ర‌ద‌ని సీజేఐ స్ప‌ష్టం చేశారు. వేరే పిటిష‌న్ దాఖ‌లు చేసుకోవాల‌ని కోరారు. తదుపరి విచారణను జులై 23కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
Supreme Court
Justice BR Gavai
Kancha Gachibowli land scam
Hyderabad
Environmental clearances
Telangana government
CS
Whistleblower cases
July 23 hearing

More Telugu News