Santhanam: వివాదంలో చిక్కుకున్న 'డీడీ నెక్ట్స్ లెవల్' చిత్రం

- హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా డీడీ నెక్ట్స్ లెవెల్ మూవీలోని కిస్సా 47 పాట ఉందని ఆరోపణలు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన సేలంకు చెందిన బీజేపీ లీగల్ టీమ్
- ఏ ఒక్కరి మనోభావాలను దెబ్బతీసే విధంగా మూవీ తీయలేదన్న నటుడు సంతానం
ప్రముఖ తమిళ నటుడు సంతానం ప్రధాన పాత్రలో నటించిన హారర్ కామెడీ చిత్రం 'డీడీ నెక్స్ట్ లెవెల్' వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ చిత్రం మే 16న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది.
అయితే, ఈ చిత్రంలోని కిస్సా 47 పాట హిందువుల ఆస్తిక భావాలకు, తిరుమల శ్రీవారిని అవమానించేలా ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై సేలంకు చెందిన బీజేపీ లీగల్ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిస్సా 47 పాటలో వాడిన 'గోవింద గోవింద' అనే పదాలు తిరుపతి ఏడుకొండలలో భక్తులు ఆరాధించే పవిత్ర స్వామికి సంబంధించినవని, పాటలో ఈ పదాలు ఉపయోగించడం హిందూ సంప్రదాయాన్ని దూషించే విధంగా ఉందని, భక్తి గీతాలలో ఉపయోగించే పవిత్రమైన పదాలకు అవమానకరమని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ వివాదంపై తాజాగా నటుడు సంతానం స్పందించారు. తాము ఏ ఒక్కరి మనోభావాలను దెబ్బతీసే విధంగా సినిమా తీయలేదని ఆయన అన్నారు. అలా ఉంటే తమకు సెన్సార్ నుంచి క్లియరెన్స్ వచ్చి ఉండేది కాదన్నారు. సెన్సార్ బోర్డు నుంచి అన్ని విధాలుగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కనుక తాము సినిమాను ఎప్పుడెప్పుడు విడుదల చేద్దామా అని ఎదురు చూస్తున్నామని తెలిపారు. సెన్సార్ బోర్డు నిబంధనలకు అనుగుణంగానే సినిమాను రూపొందించామని, ఏ ఒక్కరి విషయంలోనూ తప్పుగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు. తాము రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఆరోపణలు చేసే వారిని ఉద్దేశించి ఘాటుగా బదులిచ్చారు.