Kodali Nani: కొడాలి నాని నమ్మక ద్రోహి.. వైసీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఖాసిం

Kodali Nani Accused of Betrayal by YSRCP Leader
  • నాని అసమర్థుడన్న మహ్మద్ ఖాసిం
  • ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పనితీరుపై ప్రశంసలు 
  • రాజకీయాల నుండి వైదొలగుతున్నట్లు ప్రకటన
  • గతంలో చేసిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్
గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత కొడాలి నానిపై అదే పార్టీకి చెందిన మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ ఖాసిం (అబూ) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కొడాలి నాని అసమర్థుడని, దశాబ్దాల పాటు గెలిపించిన గుడివాడ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి, కష్టకాలంలో వారిని వదిలి అజ్ఞాతంలోకి వెళ్లిన నమ్మకద్రోహి అని ఆరోపించారు. ఖాసి వ్యాఖ్యలతో కూడిన ఓ వీడియో కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతూ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.

 వైరల్ అవుతున్న వీడియోలో కొడాలి నాని పనితీరు పట్ల ఖాసిం పూర్తి అసహనం వ్యక్తం చేశారు. "నానిని నమ్మి మోసపోయాను. ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు. కార్యకర్తల కష్టసుఖాలను కూడా పట్టించుకోవడం లేదు" అని ఆవేదన వ్యక్తం చేశారు. నందివాడ మండలంలో బుడమేరు వరదల సమయంలో పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కొడాలి నాని గానీ, ఆయన అనుచరులు గానీ ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు.

మరోవైపు, ప్రస్తుత గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పనితీరును ఖాసిం ప్రశంసించారు. వరద బాధిత ప్రాంతాల్లో రాము, ఆయన అనుచరులు పర్యటించి బాధితులకు అండగా నిలిచారని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాము నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. "ఎన్నికలు కాగానే రాము పారిపోతారని అప్పట్లో ప్రచారం చేస్తే నమ్మాను. కానీ ఆయనపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గానూ ఇప్పుడు క్షమాపణ చెబుతున్నాను" అని ఖాసిం పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాను ఇక రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఖాసిం ఈ వీడియోలో ప్రకటించారు.

 వీడియో నేపథ్యం 
 గతంలో బుడమేరు వరదలు సంభవించిన సమయంలోనే ఖాసిం ఈ వీడియోను రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే, అప్పట్లో ఈ వీడియో వెలుగులోకి రాకపోవడంతో ఈ ఏడాది మార్చి నెలలో ఆయనకు వైసీపీ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. ఇప్పుడు, ఈ పాత వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తుండటం రాజకీయంగా చర్చనీయాంశమైంది.  
Kodali Nani
YSRCP
Mohammad Kasim
Gudivada
Andhra Pradesh Politics
Viral Video
Political Controversy
Venigalla Ramu
Party Defection
Election

More Telugu News