కేసును కొట్టి వేయాలంటూ కర్ణాటక హైకోర్టులో సోనూ నిగమ్ పిటిషన్

  • బెంగళూరు సంగీత కచేరీలో సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై సోనూ నిగమ్‌పై కేసు
  • కేసు కొట్టివేతకు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు
  • జస్టిస్ శివశంకర్ అమరన్నవర్ ధర్మాసనం విచారణ
ప్రముఖ నేపథ్య గాయకుడు సోనూ నిగమ్ తనపై బెంగళూరులో నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల నగరంలో జరిగిన ఓ సంగీత కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు భాషా విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆ కేసును రద్దు చేయాలని కోరుతూ ఆయన క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేశారు.

సోనూ నిగమ్ సమర్పించిన ఈ పిటిషన్‌పై జస్టిస్ శివశంకర్ అమరన్నవర్ నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ మంగళవారం విచారణ జరిపింది. ప్రాథమిక వాదనలు విన్న ధర్మాసనం, తదుపరి విచారణను వాయిదా వేసింది.

బెంగళూరులో జరిగిన ఓ సంగీత ప్రదర్శన సందర్భంగా ఈ వివాదం మొదలైంది. సోనూ నిగమ్ వేదికపై పాటలు పాడుతున్న సమయంలో, ప్రేక్షకుల్లో నుంచి ఒకరు కన్నడలోనే పాడాలని డిమాండ్ చేశారు. దీంతో కొంత అసహనానికి గురైన సోనూ నిగమ్, పాటను మధ్యలోనే ఆపివేసి ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడారు. తనకు భాషపై ఎంతో అభిమానం ఉందని, అయితే సదరు అభిమాని తనను బెదిరించినట్లుగా మాట్లాడటం బాధ కలిగించిందని వ్యాఖ్యానించారు. "పహల్గామ్‌లో ఏం జరిగిందో దానికి కూడా ఇలాంటి ప్రవర్తనే కారణం. ఇప్పుడు మీరు చేసిన ఇలాంటి పని వల్లనే అక్కడ ఆ దాడి జరిగింది" అని అన్నారు.

ఈ వ్యాఖ్యలపై కన్నడ ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ‘కర్ణాటక రక్షణ వేదిక’ బెంగళూరు నగర విభాగం అధ్యక్షుడు ధర్మరాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోనూ నిగమ్‌పై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా, ‘కర్ణాటక ఫిల్మ్‌ఛాంబర్ ఆఫ్ కామర్స్’ ఆయనపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ పరిణామాల క్రమంలో సోనూ నిగమ్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. "ఈ వివాదంలో తప్పు ఎవరిదో తేల్చుకోవాల్సింది వివేకవంతులైన కర్ణాటక ప్రజలే. వారిచ్చే తీర్పును నేను శిరసావహిస్తాను. కర్ణాటక పోలీసులు, న్యాయ వ్యవస్థల పట్ల నాకు సంపూర్ణ గౌరవం ఉంది" అని ఆయన ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.


More Telugu News