Telangana Cyber Security Bureau: 'శంషాబాద్ విమానాశ్రయంలో ఉగ్రవాది పట్టివేత?' వీడియోపై స్పందించిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో

Shamshabad Airport Terrorist Video Cyber Security Bureau Responds
  • శంషాబాద్ విమానాశ్రయంలో ఉగ్రవాది పట్టివేత అంటూ ప్రచారం
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో దృశ్యాలు
  • అది మాక్ డ్రిల్ వీడియో అని తేల్చిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో
హైదరాబాద్‌లోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ఉగ్రవాదిని భద్రతా సిబ్బంది పట్టుకున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం తీవ్ర కలకలం రేపింది. దీనికి సంబంధించినదంటూ ఒక వీడియో కూడా వైరల్ అవుతోంది. అయితే, ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) అధికారులు స్పష్టం చేశారు. ఇది పూర్తిగా నిరాధారమైన వార్త అని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు తెలిపారు.

సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వీడియోపై టీజీసీఎస్‌బీ అధికారులు ఫ్యాక్ట్ చెక్ నిర్వహించారు. ఆ పరిశీలనలో అది నకిలీ వీడియో అని తేలిందని వెల్లడించారు. ఇటీవల శంషాబాద్ విమానాశ్రయంలో భద్రతాపరమైన అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించేందుకు నిర్వహించిన మాక్‌ డ్రిల్‌కు సంబంధించిన దృశ్యాలను కొందరు దురుద్దేశంతో ఉగ్రవాది పట్టివేత దృశ్యాలుగా చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారని టీజీసీఎస్‌బీ పేర్కొంది. ఆ వీడియోలో కనిపిస్తున్నది భద్రతా బలగాలు మాక్‌ డ్రిల్‌లో భాగంగా చేస్తున్న విన్యాసాలేనని, నిజంగా ఉగ్రవాదిని పట్టుకున్న ఘటన కాదని వివరించారు.

ఈ నేపథ్యంలో, ప్రజలు ఆధారం లేని, అధికారికంగా ధృవీకరించని వార్తలను, వీడియోలను విశ్వసించవద్దని తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు సూచించారు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని, వదంతులను సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏదైనా సమాచారంపై అనుమానం ఉంటే, అధికారిక వర్గాల ద్వారా నిర్ధారించుకోవాలని సూచించారు.
Telangana Cyber Security Bureau
Hyderabad Shamshabad Airport
Fake Terrorist Video
Viral Video
Social Media Hoax

More Telugu News