Vennella Kishore: కానీ నేను సర్జరీ జోలికి వెళ్లలేదు.. నటనే ప్రధానం అనుకున్నా: వెన్నెల కిశోర్

- తన డ్రీమ్ రోల్ దూకుడు మూవీలోనిదేనన్న నటుడు వెన్నెల కిశోర్
- నాడు స్లిమ్‌గా కనిపించేందుకు సర్జరీ చేయించుకోవాలని సూచించారని వెల్లడి
- స్లిమ్‌గా లేకపోయినా డైరెక్టర్లు తననే భరిస్తున్నారంటూ వెన్నెల కిశోర్ చలోక్తి
ప్రముఖ హాస్య నటుడు వెన్నెల కిశోర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఒక సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్‌లో ఎదురైన ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. తాను అనేక సినిమాల్లో నటించినప్పటికీ, తన డ్రీమ్ రోల్ మాత్రం దూకుడు చిత్రంలోని పాత్రేనని ఆయన చెప్పారు.
ఆ సినిమాలో మహేశ్ బాబు సరసన అంత మంచి పాత్ర రావడంతో తన కల నెరవేరిందని అన్నారు. ఆ సినిమా కోసం డైరెక్టర్ శ్రీను వైట్ల కథ చెప్పిన సమయంలో తాను లావుగా ఉన్నానని, పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం సన్నగా కనిపించాలని చెప్పారన్నారు. అవసరమైతే సర్జరీ చేయించుకోమని కూడా సలహా ఇచ్చారని, కానీ తాను సర్జరీ జోలికి వెళ్లలేదని అన్నారు.
వ్యాయామాలు చేసినా అనుకున్నంత సన్నబడలేదని, అయినా అలానే నటించానని, అదే ఆ పాత్రకు కలిసి వచ్చిందని చెప్పారు. ఆ నటనకు మంచి ప్రశంసలు కూడా వచ్చాయని తెలిపారు. అప్పటి నుంచి తాను నటనను మాత్రమే ప్రధానంగా తీసుకుంటున్నానని వెల్లడించారు. కొన్నిసార్లు పాత్ర కోసం శరీరాకృతిని మార్చుకోవాలని చెబుతున్నా, అది తన శరీరానికి సరిపడటం లేదని, అయినా దర్శకులు తనను భరిస్తున్నారంటూ చలోక్తి విసిరారు.