32 అంతస్తుల పైనుంచి దూకి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

  • హైదరాబాద్‌లోని కోకాపేటలో ఘటన
  • కొంతకాలంగా కుంగుబాటుకు చికిత్స  
  • మృతుడి భార్య కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగే
హైదరాబాద్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మానసిక కుంగుబాటుతో బాధపడుతున్న ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, తాను నివాసముంటున్న బహుళ అంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాపేటలో శనివారం ఉదయం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

నార్సింగి పోలీస్ ఇన్‌స్పెక్టర్ హరికృష్ణారెడ్డి, స్థానికుల కథనం ప్రకారం మృతుడిని ఢిల్లీకి చెందిన అమన్‌జైన్‌ (32)గా గుర్తించారు. ఆయన తన భార్యతో కలిసి కోకాపేటలోని మైహోం తర్ష్కయ అపార్ట్‌మెంట్స్‌లోని ఒకటో టవర్‌లో నివాసం ఉంటున్నారు. అమన్‌జైన్‌, ఆయన భార్య ఇద్దరూ సాఫ్ట్‌వేర్ రంగంలోనే ఉద్యోగాలు చేస్తున్నారు. అమన్‌జైన్‌ కొంతకాలంగా తీవ్రమైన కుంగుబాటుతో బాధపడుతున్నాడని, దానికి సంబంధించి చికిత్స కూడా పొందుతున్నాడని తెలిసింది.

శనివారం ఉదయం కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్న సమయంలో అమన్‌జైన్‌ తాను నివాసముంటున్న ఒకటో టవర్‌లోని 32వ అంతస్తు పైకి వెళ్లాడు. అక్కడి నుంచి అకస్మాత్తుగా కిందకు దూకాడు. దీంతో తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్‌స్పెక్టర్ హరికృష్ణారెడ్డి వెల్లడించారు. ఆత్మహత్యకు దారితీసిన కచ్చితమైన కారణాలు, కుంగుబాటుకు సంబంధించిన పూర్తి వివరాలపై లోతుగా విచారణ జరుపుతున్నామని ఆయన తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.  


More Telugu News