India: పాక్ పై పక్కా ఆధారాలతో ఐరాసకు బృందాన్ని పంపిస్తున్న భారత్

India to Send Team to UN with Evidence Against Pakistan

  • పహల్గామ్ దాడికి టీఆర్ఎఫ్ బాధ్యత... దానిని రక్షించేందుకు పాక్ యత్నం
  • ఐరాసలో పాక్‌ను ఎండగట్టనున్న భారత్
  • లష్కరే అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించాలని డిమాండ్

ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ ద్వంద్వ వైఖరిని ప్రపంచం ముందు మరోసారి ఎండగట్టేందుకు భారత్ సిద్ధమైంది. ముఖ్యంగా కశ్మీర్‌లో హింసకు పాల్పడుతున్న లష్కరే తోయిబా అనుబంధ సంస్థ 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' (టీఆర్ఎఫ్)ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని కోరుతూ, ఇందుకు సంబంధించిన బలమైన ఆధారాలతో త్వరలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ)కి ఒక ప్రతినిధి బృందాన్ని పంపనుంది.

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో 26 మంది అమాయక పౌరుల మృతికి కారణమైన ఉగ్రదాడిని ఖండిస్తూ యూఎన్‌ఎస్‌సీ విడుదల చేసిన ప్రకటనలో టీఆర్ఎఫ్ పేరును చేర్చకుండా పాకిస్థాన్ అడ్డుకుందని భారత్ తీవ్రంగా ఆరోపించింది. ఈ దాడికి తామే బాధ్యులమని టీఆర్ఎఫ్ రెండుసార్లు ప్రకటించుకున్నప్పటికీ, పాక్ దౌత్యపరంగా ఉగ్రసంస్థలకు అండగా నిలుస్తోందని ఈ చర్య స్పష్టం చేస్తోందని భారత వర్గాలు పేర్కొన్నాయి. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పుట్టుకొచ్చిన టీఆర్ఎఫ్, లక్షిత హత్యలు, ఉగ్రవాదుల నియామకం, ఆయుధాల అక్రమ రవాణా వంటి అనేక హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడుతోందని భారత్ ఆరోపిస్తోంది.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 1267 (1999) కింద ఏర్పాటైన... ఐసిల్ (దాయెష్) మరియు అల్-ఖైదా ఆంక్షల కమిటీగా కూడా పిలువబడే ప్రత్యేక కమిటీ వచ్చే వారం సమావేశం కానుంది. ఈ కమిటీ ఉగ్రవాద నిర్మూలనకు, ముఖ్యంగా ఐసిల్, అల్-ఖైదా మరియు వాటితో సంబంధం ఉన్న వ్యక్తులు, సంస్థలపై ఆంక్షల అమలును పర్యవేక్షిస్తుంది. ఈ సమావేశంలో టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా అధికారికంగా గుర్తించి, దాని సభ్యులపై ఆంక్షలు, ప్రయాణ నిషేధాలు విధించాలని భారత్ డిమాండ్ చేయనుంది.

India
Pakistan
UNSC
Terrorism
The Resistance Front (TRF)
Lashkar-e-Taiba
Article 370
Jammu and Kashmir
Counter-terrorism
International Relations
  • Loading...

More Telugu News