దర్శకుడు కోరుకున్న కారును గిఫ్ట్ గా ఇచ్చిన సూర్య, కార్తి

  • దర్శకుడి కల నెరవేర్చిన సూర్య, కార్తి!
  • కార్తి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో మెయ్యళగన్
  • విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రం
  • దర్శకుడు ప్రేమ్ కుమార్ కు మహీంద్రా థార్ అందించిన కోలీవుడ్ బ్రదర్స్
కోలీవుడ్ బ్రదర్స్ సూర్య, కార్తి మరోసారి తమ ఉదారతను చాటుకున్నారు. '96' సినిమాతో ప్రఖ్యాతి పొందిన దర్శకుడు ప్రేమ్‌కుమార్‌కు ఆయన కలల కారు అయిన మహీంద్రా థార్‌ను బహుమతిగా అందించి ఆశ్చర్యపరిచారు. ఈ అనూహ్య కానుకతో దర్శకుడు ప్రేమ్‌కుమార్‌ ఆనందంలో మునిగిపోయారు.

వివరాల్లోకి వెళితే, కార్తి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన 'మెయ్యళగన్' (తెలుగులో 'సత్యం సుందరం') చిత్రానికి ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వం వహించారు. గతేడాది విడుదలైన ఈ చిత్రానికి సూర్య, జ్యోతిక నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా నిర్మాణం నుంచే సూర్య, కార్తిలకు ప్రేమ్‌కుమార్‌తో మంచి అనుబంధం ఏర్పడింది.

ఈ నేపథ్యంలోనే, ప్రేమ్‌కుమార్‌కు ఎంతో ఇష్టమైన మహీంద్రా థార్ కారును సూర్య కొనుగోలు చేసి, సోదరుడు కార్తి చేతుల మీదుగా ప్రేమ్‌కుమార్‌కు అందజేశారు. ఈ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌పై ప్రేమ్‌కుమార్‌ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. "మహీంద్రా థార్ నా కలల వాహనం. ముఖ్యంగా తెలుపు రంగు Roxx AX 5L, 5-డోర్ వెర్షన్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను. మార్కెట్‌లోకి రాగానే, నేను దాచుకున్న డబ్బుతో కొనాలనుకున్నాను. అయితే, బుక్ చేస్తే ఏడాది ఆగాలని తెలియడం, ఆ తర్వాత నా దగ్గరున్న డబ్బు ఖర్చుకావడంతో నా కలను పక్కనపెట్టేశాను" అని తెలిపారు.

ఆయన ఇంకా కొనసాగిస్తూ, "ఇటీవల సూర్య అన్న నుంచి నాకిష్టమైన కారు ఫొటోతో పాటు 'కారు వచ్చేసింది' అని సందేశం వచ్చింది. మొదట ఏం అర్థం కాలేదు. ఫొటో చూసి ఆశ్చర్యపోయాను. సూర్య అన్న నాకోసం ఈ కారును కొని బహుమతిగా ఇచ్చారు. కార్తి అన్న చేతుల మీదుగా తాళాలు అందుకున్నాను. దీన్ని కేవలం బహుమతిగా కాకుండా, ఒక అన్న తన తమ్ముడి కలను నెరవేర్చినట్టుగా భావిస్తున్నాను" అంటూ సూర్య, కార్తిలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 


More Telugu News