Bill Gates: ఆస్తి మొత్తం దానం చేస్తానంటున్న బిల్ గేట్స్... మాజీ భార్య స్పందన

Bill Gates to Donate Entire Fortune Melinda Gates Responds

  • తమ ఫౌండేషన్ నిధులన్నీ దానం చేయాలని బిల్ గేట్స్ నిర్ణయం
  • రూ.16 లక్షల కోట్ల నిధులు ప్రజలకు ఇచ్చేసేందుకు సిద్ధం
  • ఇది అద్బుతమైన నిర్ణయమన్న మెలిండా గేట్స్

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్, తాను సహ-స్థాపించిన బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ విషయంలో ఒక విప్లవాత్మక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. 2045 నాటికి ఫౌండేషన్ వద్ద ఉన్న సుమారు 200 బిలియన్ డాలర్ల (సుమారు రూ.16 లక్షల కోట్లకు పైగా) భారీ నిధిని పూర్తిగా ప్రజారోగ్యం, పేదరిక నిర్మూలన వంటి సేవా కార్యక్రమాలకు వెచ్చించి, ఆపై సంస్థను శాశ్వతంగా మూసివేయాలని యోచిస్తున్నారు. దీనిపై బిల్ గేట్స్ మాజీ భార్య మెలిండా గేట్స్ స్పందించారు. ఇది ఒక అద్భుతమైన నిర్ణయం అని అభివర్ణించారు. ఈ ఆలోచనకు తాను సంపూర్ణ మద్దతు తెలిపుతున్నట్టు ప్రకటించారు.

ఫార్చ్యూన్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెలిండా గేట్స్ మాట్లాడుతూ, రాబోయే రెండు దశాబ్దాల్లో ఫౌండేషన్ తన వార్షిక వ్యయాన్ని రెట్టింపు చేసి, ఈ నిధులను ప్రాణాంతక వ్యాధుల నిర్మూలన, మాతాశిశు మరణాల తగ్గింపు, ప్రపంచవ్యాప్త పేదరిక నిర్మూలనకు ఖర్చు చేస్తుందని తెలిపారు. "ఈ భారీ వనరులు తిరిగి సమాజానికే చెందాలన్నది ఫౌండేషన్ అసలు ఉద్దేశం" అని ఆమె స్పష్టం చేశారు.

గత ఏడాది ఫౌండేషన్ నుంచి వైదొలగి, 'పివోటల్ వెంచర్స్' అనే సొంత సంస్థ ద్వారా మహిళా సాధికారతపై దృష్టి సారించిన మెలిండా, ఫౌండేషన్ నిధులను పూర్తిగా ఖర్చు చేయాలన్నది తమ ఉమ్మడి ఆలోచనే అయినా, కాలపరిమితిపై తుది నిర్ణయం బిల్ గేట్స్ దేనని తెలిపారు. బిలియనీర్లు తాము ఆర్జించిన సంపదలో కొంత భాగాన్ని సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన నైతిక బాధ్యత ఉందని ఆమె నొక్కిచెప్పారు. "ఫౌండేషన్ అధికారికంగా మూసివేసినా, మా కృషి వల్ల ఎంతోమంది మెరుగైన జీవితం గడుపుతారన్నదే మాకు సంతృప్తి" అని ఆమె అన్నారు. 

Bill Gates
Melinda Gates
Bill and Melinda Gates Foundation
Philanthropy
Donation
Global Health
Poverty Eradication
Billionaires
Charity
Philanthropic Giving
  • Loading...

More Telugu News